27-02-2025 12:34:30 PM
పోసాని అక్రమ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో పరామర్శించిన జగన్
పోసాని అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని భరోసా
హైదరాబాద్: సినీనటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy ) ఖండించారు. అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతను గురువారం ఫోన్ లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali Arrest)కి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు.
పోసానికి మద్దతుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సహా పార్టీ నాయకులను కోర్టుకు పంపినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్‌లోని తన నివాసంలో అరెస్టు చేసి, ఆ తర్వాత అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్(Obulavaripalli Police Station)కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అతని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకుడు జోగిమణి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఆయన అరెస్టు జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 196, 353(2),3(5) కింద కేసు నమోదు చేశారు. జగన్ మోహన్ రెడ్డి కూడా రాజకీయ వాతావరణంపై వ్యాఖ్యానిస్తూ, రాష్ట్రంలో అణచివేత పాలన ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నారు.