నిరుద్యోగులను మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు ఫోకస్
బూత్‌ల వారీగా ఓటర్లను గుర్తిస్తూ ప్రలోభాలు
రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మంది నిరుద్యోగులు
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా గెలుపు కోసం చెమటోడ్చుతున్నారు. ఊరు, వాడ, బస్తీలు కలియ తిరుగుతూ ఈసారి ఎన్నికల్లో తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో యువత నిర్ణయత్మాక శక్తులుగా ఉండటంతో వారిని మచ్చిక చేసేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు.
బూత్‌ల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకొని యువ ఓటర్లను గుర్తించే పనిలో పడ్డారు. వీరిని తమ వైపు తిప్పుకుంటే గెలుపు నల్లేరు నడకేనని భావిస్తున్నారు. యువతను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే పలు చోట్ల ప్రలోభాలకు తెర లేపినట్లు విమర్శలు వస్తున్నాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సంధిస్తూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు.
గత పాలకుల వైఫల్యాను కాంగ్రెస్ తూర్పార పడుతుండగా, బీఆర్‌ఎస్ మాత్రం ఆరు గ్యారెంటీలు పెద్ద బోగస్ అంటూ మైకుల ముందు ఊదరగొడుతోంది. మరోవైపు కమలనాథులు మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒకటేనని జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 3.10 కోట్ల మంది ఓటర్లు ఉంటే వాటిలో 9.9 లక్షల కొత్తగా నమోదైయ్యాయి. 18 నుంచి 39 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు 1.28 కోట్లు మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా 19. 74 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీలు
తెలంగాణలో ప్రతి ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. కేంద్రంలో తాము అధికారం చేపట్టిన తరువాత టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేయించి అందులో 80 శాతం ఉద్యోగాలు స్థ్ధానిక యువతకే ఇచ్చేలా తమ వంతు కృషి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు.
మరోవైపు, నీళ్లు, నిధులు, నియామకాలతో పురుడు పోసుకున్న బీఆర్‌ఎస్ గద్దెనెక్కిన తరువాత నిరుద్యోగులను మోసం చేసిందని, నిరుద్యోగ యువతను నిండా ముంచిందని 10 సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కేసీఆర్ 46 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని, యువతను ఆదుకోవడంలో బీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.
ఉద్యోగాల భర్తీపై అసత్య ప్రచారం
ఇక, కాంగ్రెస్‌ను నమ్మితే యువత భవిష్యత్తు అంధకారమేనని, ఆరుగ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఉచిత బస్సు హామీ తప్ప ఒకటి కూడా అమలు చేయలేదని, ఎన్నికల కోడ్‌తో మరో ఆరు నెలల పాటు కాలయాపన చేసి తరువాత వాటిని ప్రజలు మరిచిపోయేలా చేస్తుందని బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎల్బీస్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎంపికైన వారికి అందజేసి తాము భర్తీ చేసినట్లు గొప్పలు చెప్పకుంటుందని పేర్కొన్నారు.
ఇటీవల 560 గ్రూప్ పోస్టులు వేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారని, వాటిలో 500 పోస్టులు బీఆర్‌ఎస్ హయాంలో వేసినవేనని, వారు 60 పోస్టులు మాత్రమే వేశారని, గుర్తు చేశారు. అసత్య ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మవద్దని కోరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అత్యధిక సీట్లు వస్తే కేంద్రంలో చక్రం తిప్పి తమ సత్తా చూపిస్తామని విపక్ష అభ్యర్థులకు సవాల్ విసురుతున్నారు.
యువత భవిష్యత్తుకు బీజేపీ భరోసా
యువతకు బంగారు భవిష్యత్తు కల్పించే సత్తా ఒక బీజేపీ పార్టీకే ఉందని, కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తరువాత 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి మూడోసారి అధికారం కట్టిబెట్టి తెలంగాణలో 12 సీట్లు గెలిపిస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రులు హమీలు కురిపిస్తున్నారు.
ఇన్నాళ్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు అధికారం కట్టాబెట్టారని, వారితో యువతకు ఒరిగిందేమీ లేదని, మోసం చేయడం తప్ప ఆ పార్టీ నాయకులకు అభివృద్ది, నిరుద్యోగంపై సోయి లేదని విమర్శలు గుప్పిస్తు న్నారు. ఈసారి బీజేపీకి మెజార్టీ సీట్లు ఇస్తే తెలంగాణ అభివృద్దికి ప్రత్యేక నిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు.