28-03-2025 06:01:17 PM
ఉచిత ఆర్మీ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకున్న యువకులు
ఎస్బిఐ, భవిష్య భారత్ సంస్థలను అభినందించిన స్థానిక మేధావులు
నారాయణఖేడ్: నారాయణఖేడ్ ప్రాంతంలోని మనూర్ మండలం రాయిపల్లిలో ఎస్బిఐ, భవిష్య భారత్ స్వచ్చంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్మీ రిక్రూమెంట్ కోచింగ్ గత కొంత కాలంగా నిర్వహిస్తున్నారు. దీంతో పలువురు యువకులు రెండు నెలల కాలం పాటు ఆర్మీ ఎంపికకు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే భారత ఆర్మీ రిక్రూట్మెంట్ ఫలితాల్లో ఇక్కడ శిక్షణ పొందిన వారిలో ఏడుగురు యువకులు ఎంపికయ్యారు. దీంతో స్థానిక శిక్షణ కేంద్రంలో యువకులు సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ పరిధిలోని మనూరు మండలం అని చెప్పవచ్చు. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాయిపల్లిలో ఎస్బిఐ, భవిష్య భారత్ సంస్థలు స్థానిక యువకులకు రెండు నెలలు ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది.
గత ఏడాది ఇక్కడి నుండి ఇద్దరు ఆర్మీ లో సైతం ఎంపికయ్యారు. తాజా ఫలితాలు ఏకంగా ఏడుగురు యువకులు ఎంపిక అయ్యారు. రాయిపల్లి శిక్షణ కేంద్రం నుండి ఏడుగురు ఎంపిక అవడంతో స్థానిక నాయకులు , యువకులు, మేధావులు వారికి అభినందించారు. స్థానిక యువకులకు రెండు నెలలు ఉచితంగా శిక్షణతో పాటు భోజనం వసతి, దుస్తువులు, రెండు జతుల షు లు సైతం వారికి అందించి ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ జె సి ఓ తో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. శిక్షణలో ఎంపిక చేసే విధానం వారికి వివరిస్తున్నారు. ప్రతి రెండు నెలలకు 25 మంది యువకులకు శిక్షణ అందిస్తున్నారు. శిక్షణతో పాటు ప్రత్యేక ఉపాధ్యాయునితో ఆర్మీ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్ష విధానం, జనరల్ నాలెడ్జ్ , తదితర అంశాలపై సూచనలు సలహాలు అందిస్తున్నారు.
ఆనందంగా ఉంది: అగ్ని వీర్ కు ఎంపిక అవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తీసుకున్న శిక్షణ ఎంతగానో ఉపయోగపడింది మాలాంటి పేద యువకులకు ఎలాంటి ఖర్చులు లేకుండా ఉచితంగా అన్ని వసతులు కల్పించి ఇచ్చిన శిక్షణ ఎన్నటికీ మరువలేనిది. తనకు దేశ సేవ చేయడం అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. -గుడిమే పాండు
మరింత ఉత్సాహంతో శిక్షను అందిస్తాం: తాను శిక్షణ ఇచ్చిన యువకుల్లో ఏడుగురు అగ్ని వీరులకు ఎంపిక అవడం ఎంతో ఉత్సాహం నింపింది. యువకులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని దేశ సేవకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎస్బిఐ, భవిష్య భారత్ సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయం