28-04-2025 06:34:21 PM
ఎస్పీ కిరణ్ ఖరే...
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): యువత సన్మార్గంలో నడవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే(District SP Kiran Kare Prabhakar) అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు జిల్లాలు గడ్చిరోలి, బీజాపూర్, తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని క్రీడాకారులకు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను పలిమేల మండల కేంద్రంలో సోమవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుతో కలిసి ఎస్పీ వాలీబాల్ ఆడారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయన్నారు. సరిహద్దు ప్రజలు, యువతతో మమేకమవ్వడమే ప్రజా భరోసా టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు.
పలిమేల మండలంలో త్వరలోనే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. యువత మావోయిస్ట్ ల మాయ మాటలు నమ్మవద్దని, సంఘ విద్రోహులకు దూరంగా ఉండాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే, బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఈ టోర్నీలో మహారాష్ట్ర గచ్చిరోలి, చతిస్గడ్ బీజాపూర్, ములుగు, భూపాలపల్లికి చెందిన మొత్తం 105 టీంలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్, కాటారం సిఐలు, రామచందర్ రావు, నాగార్జున రావు, పలిమేల ఎస్ఐ రమేష్, ఎస్సైలు పవన్, తమాషా రెడ్డి, మహేందర్, నరేష్, శ్రీనివాస్, వాలీబాల్ క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.