ఐటిడిఏ పిఓ రాహుల్...
భద్రాచలం (విజయక్రాంతి): నిరుద్యోగులైన గిరిజన యువతీ యువకులు స్వశక్తితో జీవనోపాధి పెంపొందేందుకు ఎంఎస్ఎం ఈ పథకం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం తన చాంబర్లో సూరప్ప ప్లయాష్ మేకింగ్ బ్రిక్స్ యూనిట్ నిర్మాణం చేపట్టడానికి రెండో విడతగా రూ.9 లక్షల చెక్కును యూనిట్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులు 15 లక్షల సబ్సిడీతో 25 లక్షల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన సూరప్ప ప్లయాస్ మేకింగ్ బ్రిక్స్ యూనిట్ ద్వారా సిమెంట్ ఇటుకలు తయారు చేసి వాటి అమ్మకాల ద్వారా వారు జీవనోపాధి పొందటమే కాక పదిమందికి ఉపాధి కల్పించి ఆర్థికంగా చేయూత అందించాలని అన్నారు.
యూనిట్ ఏర్పాటుకు రూ.25 లక్షలు కాస్ట్ కాగా రూ.15 లక్షల సబ్సిడీ, రూ2.50 లక్షలు బెనిఫిషర్ కంట్రిబ్యూషన్, బ్యాంకు రుణం రూ 7.50 లక్షలు అందించడంతో యూనిట్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం మండలాలలో గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రక్రియ ప్రారంభమైనందున త్వరగా ఇటుకల తయారీ యూనిట్ నిర్మించుకొని గ్రామాలలో తెలిసే విధంగా ప్రచారం చేసి ఇటుకలు అమ్మకాలు జరిపి ఆర్థికంగా లబ్ధి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, గ్రూప్ సభ్యులు ఆంజనేయులు, మానస, రాధమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.