01-02-2025 07:35:59 PM
తాండూర్ సీఐ కుమారస్వామి...
బెల్లంపల్లి (విజయక్రాంతి): విద్యార్థులు, యువత పెడదారిన పట్టకుండా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వాడకుండా భావి జీవితాన్ని మార్గనిర్దేశనం చేస్తూ 'మత్తు’ కు దూరంగా ఉండాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి అన్నారు. శనివారం తాండూర్ మండలం అచలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు గ్రామపంచాయతీ పరిధిలోని యువతకు అచలాపూర్ గ్రామానికి చెందిన యువకుడు దుద్దిల్ల విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐ కుమారస్వామి మాట్లాడుతూ... విద్యార్థులు యుక్త వయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత విద్య, ఉద్యోగాలు సాధించాలన్నారు. యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారన్నారు. కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తెస్తాడని తల్లిదండ్రులు కలలు కంటుంటే, వీరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
నాడు పట్టణాలకే పరిమితమైన గంజాయి భూతం నేడు గ్రామాలకు పాకిందని, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ ఇతరులపై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయన్నారు. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులదే బాధ్యత అని, పిల్లల కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, తాండూర్ మండల విద్యాధికారి ఎస్ మల్లేశం, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, బెల్లంపల్లి డివిజన్ ఎక్సైజ్ ఎస్సై ఎం.వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి కల్పన, పాఠశాల సలహాదారులు సిహెచ్.విజయ్ కుమార్, నిర్వాహకులు దుద్దిల్ల విష్ణువర్ధన్, అభినవ సంతోష్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.