31-03-2025 10:05:25 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదగాలి..
రాజీవ్ యువ వికాసం పథకం ప్రగతిపై నిరంతరం సమీక్షిస్తా....
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు..
సంగారెడ్డి (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువమంది దరఖాస్తులు చేసుకునేలా యువతను ప్రోత్సహించాలని, దరఖాస్తుదారులకు రెవెన్యూ అధికారులు కుల, ఆదాయ దృపత్రాలు వెంటనే మంజూరు చేయలని కలెక్టర్ క్రాంతి వల్లూరుకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ నుండి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రెటర్లు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆన్ లైన్ దరఖాస్తు చేసిన దరఖాస్తు ఫారాలు ప్రజాపాలన కేంద్రాలలో సమర్పించాలని స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాసానికి వీలైనంత ఎక్కువ మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది.
అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడాలన్న మహోన్నత ఆశయంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి పదివేల కోట్లు ఖర్చు చేస్తుందని, అధికారులు అంతా మనసుపెట్టి పనిచేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్షిస్తామని అన్నారు. సంగారెడ్డి నుండి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాసంపై సమీక్ష..
అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులతో రాజీవ్ వికాసం పథకంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో అత్యధిక సంఖ్యలో నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకునేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కుల ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే రెవెన్యూ అధికారులు కుల ఆదాయ ధ్రువపత్రాలు మంజూరు చేయాలన్నారు.
రూ 50 వేల లోపు రుణం తీసుకున్న వారికి 100% రాయితీ, రూ లక్ష లోపు రుణం తీసుకున్న వారికి 90 శాతం రాయితీ, రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 80% రాయితీ 2 లక్షల నుంచి నాలుగు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి 70% రాయితీ లభిస్తుందని ఈ విషయంపై దరఖాస్తుదారులకు మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ పథకం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది అన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ పథకం రూ.రెండు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరూ అర్హులన్నారు.
రేషన్ కార్డు ఆధార్ కార్డు కుల ఆదాయ ధ్రువపత్రాలతో దరఖాస్తుదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మండల పరిషత్ కార్యాలయాలలో, మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ప్రజాపాలన కేంద్రాలలో తమ దరఖాస్తుల సంబంధిత పత్రాల కాపీలను అందజేయాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్ ఉన్న కుల, ఆదాయ ధ్రువపత్రాలను వెంటనే అందజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ/గిరిజన సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, జిల్లా ఆయా శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.