26-01-2025 12:00:00 AM
స్వావలంబి భారత్ అభియాన్ లక్ష్యం ఇదే
గత మూడేళ్లుగా సమాజానికి సవాల్ మారిన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా స్వావలంబి భారత్ అభియాన్(ఎస్‌బీఏ) పేరుతో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందని స్వదేశీ జాగరణ్ మం(ఎస్‌జేఎం) జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ కుమార్ వెల్లడించారు. యువత ఉద్యోగాలను వెతుక్కునే స్థాయి నుంచి ఎంప్లాయిమెంట్ ఇచ్చే స్థాయికి ఎదగాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.
దేశంలోని నిరుద్యోగ సమస్యపై ఎస్‌జేఎం బోలెడంత పరిశోధన చేసినందున నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందడం కోసం వెతుకులాడడానికి బదులుగా ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా మారడానికి అనువైన కార్యక్రమంతో ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆర్థికంగా సొంతకాళ్లపై నిలబడ్డమే కాకుండా ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా స్వదేశీ జాగరణ్ మంచ్ పలు కార్యక్రమాలను చేపట్టింది.
అయితే ఈ దారిలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసం మంచ్ యువతలో వ్యాపారతత్వాన్ని, స్వయం ఉపాధిని, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలను చేపట్టింది. ఎస్‌జేఎం ప్రారంభించిన ఎస్‌బీఏ ప్రోగ్రామ్‌కు పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే యువత నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు.
సతీష్ కుమార్ ప్రస్తుతం స్వావలంబి భారత్ అభియాన్ జాతీయ కన్వీనర్‌గా కూడా ఉన్నారు. ఎస్‌బీఏ, ఎస్‌జేఎం కార్యకలాపాలు, పంజాబ్ రైతుల ఆందోళనలు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై వచ్చిన ఆరోపణలపై శనివారం ‘విజయక్రాంతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సతీష్ కుమార్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
ఎస్‌బీఏ ప్రోగ్రామ్‌ను 2022లో ప్రారంభించాం. మూడేళ్లలో దేశవ్యాప్తంగా 600కి పైగా జిల్లాల్లో కార్యక్రమాలను నిర్వహించాం. వందలాది పరిశ్రమల భాగస్వామ్యంతో లక్షలాది మంది యువతకు చేరువయ్యాం. వారికి అవగాహన కల్పించాం. దేశంలోని దాదాపు 200కి పైగా విశ్వవిద్యాలయాల్లో ఎస్‌బీఏ ప్రోగ్రామ్‌పై నేను ప్రసంగించాను.
ఎస్‌బీఏ ప్రోగ్రామ్‌కు ప్రధాన స్రవంతి మీడియా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎస్‌బీఏ గురించి ప్రజలకు కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే ఎస్‌బీఏ ప్రారంభించిన ఎస్‌జేఎం లాంటి సంస్థలు తక్కువ ప్రొఫైల్‌ను కలిగి ఉండటమే దీనికి ప్రధాన కారణం.
లక్షలాది మంది సంతకాలతో...
త్వరలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం కొన్ని శాశ్వత కార్యక్రమాలు, విధానాలను ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. ఎస్‌బీఏ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు కేటాయించాలని లక్షలాది మంది సంతకం చేసిన డిజిటల్ పిటిషన్‌ను మేము కేంద్రానికి ఇప్పటికే సమర్పించాం.
మేము చేపట్టిన ఎస్‌బీఏ ప్రచారం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చే స్వయం సహాయక బృందాల అభివృద్ధికి కూడా ఎస్‌బీఏ దోహదం చేస్తుంది.
చాలా విజయాలు సాధించాం
యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే యజ్ఞంలో చాలా విజయాలను సాధించాం. రూ. 1000 తక్కువ పెట్టుబడితో కూరగాయలు, ఊరగాయల వ్యాపారాన్ని స్థాపించి రూ. 5 కోట్ల టర్నోవర్ సంస్థగా ఎదిగిన శ్రీమతి కృష్ణ యాదవ్ లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు.
మా విజ్ఞప్తి మేరకు యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నిరుద్యోగుల కోసం ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు రూ. 5 లక్షల రుణం ఇస్తారు. ఆరు నెలల తర్వాత ఈఎంఐ కట్టడం మొదలవుతుంది. ఇలాంటి విజయగాథలు ఎన్నో ఉన్నాయి. నిరుద్యోగ యువత ఉద్యోగార్థుల కంటే ఉద్యోగ ప్రదాతలుగా మారడానికి కావాల్సిన వ్యవస్థలను పెంపొందించుకోవాలని ఆకాక్షింస్తున్నాం.
మేము చేసిన ప్రచారంతో సేవా భారతి ఆధ్వర్యంలో వేలాది స్వావలంబన కేంద్రాలు, 2000 సిలాయి(కుట్టు) కేంద్రాలు, 4000 స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం జరుగుతోంది. 800 బ్యూటీ పార్లర్ శిక్షణా కేంద్రాలు, 600 కంప్యూటర్ శిక్షణా కేంద్రాలను సేవా భారతి ఏర్పాటు చేసింది. 4500 స్వయం సహాయక బృందాలు, 180 టైలరింగ్ కేంద్రాలు, 40 కంప్యూటర్ కేంద్రాలు, 75 కృషి వికాస్ కేంద్రాలు, 25 సంకుల్ కేంద్రాలు (క్లస్టర్ సెంటర్లు), 80 ఇతర కేంద్రాలను వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ప్రారంభించింది.
భారతీయ కిసాన్ సంఫ్‌ు 300 ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయగా.. వాటి ద్వారా 1 లక్ష మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. అలాగే స్టార్టప్‌లు, కొత్త వ్యాపారాలకు రుణ సౌకర్యాలు, సహకార బ్యాంకు పథకాలకు సంబంధించి మార్గనిర్దేశకం చేయడం ద్వారా 3 లక్షల మందికి ప్రయోజనం జరుగుతోంది. మా ప్రచారంతోనే 20 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే లక్ష కొత్త స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు దోహదపడింది.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 7000 మంది యువతకు ప్రయోజనం చేకూర్చే 90 రోజ్‌గార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. విశ్వ హిందూ పరిషత్ 5,000 మందికి ప్రయోజనం చేకూర్చే 750 శిక్షణా కేంద్రాలను ప్రారంభించింది. 5,000 మంది మహిళా వ్యవస్థాపకులకు ప్రయోజనం చేకూర్చే 350 ప్రత్యేక మైత్రి-శక్తి లేదా మహిళా పారిశ్రామిక వేత్త సంబంధిత కేంద్రాలను ప్రారంభించింది. కొద్ది సంవత్సరాలలోనే ఎస్‌బీఏ దేశంలో నిరుద్యోగ పరిస్థితి ముఖచిత్రాన్ని మార్చివేయనుంది.
దేశంలో జనాభా సంక్షోభం
భారతదేశం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మూడేళ్ల కిందే ఈ సమస్యను గుర్తించిన ఎస్‌జేఎం అనేక వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తింది. హిందూ జంటలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఎస్‌జేఎం చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి వారు చెబుతున్నారు.
దేశంలో సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్) వేగంగా తగ్గుతోంది. 1950లో టీఎఫ్‌ఆర్ 6.18గా ఉంటే.. 2021లో 1.91కి పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది కనిష్టంగా 1.6గా ఉంది. 2050 నాటికి అది 1.29కి తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వయో వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరగడానికి, శ్రామిక శక్తి తగ్గడానికి ఇది దారి తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల పలు ఆర్థికపరమైన దుష్పరిణామాలు ఎదురవుతా యి. ఇప్పటికైనా అప్రమత్తమై ఇద్దరు లేక ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించాలి.ఈ సమస్యను ఒక్క భారత దేశమే ఎదుర్కోవడం లేదు. దక్షిణ కొరియా, జపాన్, జర్మనీలాంటి పలు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే భారత దేశం సువిశాలమైనది, యువకులైన వారు ఎక్కువ మంది ఉన్న కారణంగా మన సమస్య ప్రత్యేకమైనది.
భగవత్ వ్యాఖ్యలు
దేశ స్వాతంత్య్రంపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వంటి పార్టీల అనుకూలంగా వక్రీకరించబడ్డాయి. 1947లో దేశానికి భౌగోళిక స్వాతంత్య్రం మాత్రమే వచ్చిందని, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత సాంస్కృతిక స్వాతంత్య్రం వచ్చింది అనిమాత్రమే మోహన్ భగవత్ అన్నారు. భౌగోళికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా స్వతంత్రమైన నిజమైన భారత్ గురించి ఆయన మాట్లాడారు.
పంజాబ్ రైతుల ఆందోళన
పంజాబ్‌లో కొనసాగుతున్న రైతుల ఆందోళన రాజకీయంగా ప్రేరేపితమైనవిగా అనిపిస్తోంది. రైతుల డిమాండ్ల మేరకు ప్రభుత్వం కనీస మద్దతు ధర( ఎంఎస్‌పీ) ఇస్తోంది. కానీ రైతు సంఘాల నాయకులు మాత్రం కేంద్రమే ఎంఎస్‌పీ చెల్లించాలని, రాజ్యాంగంలో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చాలా రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర ఇస్తున్నారు. మధ్యప్రదేశ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో రైతులు ఎంఎస్‌పీని తిరస్కరిస్తున్నారు. రైతుల ఆందోళనకు వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాయి. రైతులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి.
వికేంద్రీకరణ
వికేంద్రీకరణ ప్రక్రియ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. ఇప్పటివరకు ఆర్థిక ప్రణాళికలన్నీ కేంద్రం లేదా, రాష్ట్రాలు చేస్తున్నాయి. జిల్లాస్థాయి, అంతకన్నా దిగువ స్థాయి ఏజన్సీలు కేవలం వాటిని అమలు చేసేవిగానే మిగిలిపోతున్నాయి. ఆర్థిక, ఉపాధి కల్సన పథకాల రూపకల్పనకు జిల్లాను కేంద్రంగా చేయాలి.
మేడ్ భారత్.. మేక్ విత్ భారత్
దేశంలో పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉంది. భారత్‌కు ఎలాన్ మస్క్ కార్ల అవసరంకన్నా ఎలాన్ మస్క్‌కు భారత మార్కెట్ అవసరం ఉంది. విదేశీ పెట్టుబడిదారులు ‘ మేక్ విత్ భారత్’ కాన్సెప్ట్‌తో వస్తే వారిని స్వాగతించవచ్చు. మీరు డబ్బు, సాంకేతికతతో వస్తే భారత దేశం అవసరమైన మౌలిక వసతులు, శ్రామిక శక్తి, పరిశ్రమలు పెట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది.. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా చెప్తోంది.
దేశంలో నిరుద్యోగ సమస్యపై ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ (ఎస్‌జేఎం) చాలా పరిశోధనలు చేసింది. నిరుద్యోగ యువత ఉద్యోగాలను పొందాలనుకునే బదులుగా ఎంప్లాయిమెంట్ కల్పించి వ్యాపారవేత్తలుగా ఎదగాలి. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆర్థికంగా స్వావలంబన పొందేందుకు, ఇతరులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘స్వావలంబి భారత్ అభియాన్’ (ఎస్‌బీఏ) అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించాం.
మన దేశంలోని మొత్తం మానవ శక్తికి ఉపాధి కల్పించినట్లయితే భారత్ 40 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సీఐఐ నివేదిక చెప్పింది. దేశంలోని మానవ శక్తిని ఉపాధి రంగంవైపు మళ్లించే లక్ష్యం కోసం ఎస్‌జేఎం, ఎస్‌బీఏ పనిచేస్తున్నాయి. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ యువతలో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌తో పాటు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే సంకల్పంతో పలు కార్యక్రమాలను ప్రారంభించాం.
మేం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశాం. చాన్సలర్‌గా తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించాం. యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదగాలి? విద్యార్థులకు ఎలా అవగాహన కల్పించాలన్న అంశాలపై ‘ఎస్‌బీఏ’ , ‘ఎస్‌జేఎం’ ప్రతినిధులు వీసీలకు వివరిస్తారని చెప్పాం. గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారు.