- తాగిన మైకంలో బాణాసంచాతో స్టంట్లు
- ప్రమాదకర స్థాయిలో బాణాసంచా పేల్చి హంగామా
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన గణేష్ యువకుల బృందం వినాయక నిమజ్జనంలో వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో ప్రమాదకర స్థాయిలో బాణాసంచా తేల్చుతూ హంగామా సృష్టించారు. బాణాసంచా తేలుతున్నంతసేపు గ్రామస్తులంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయం భయంగా గడిపారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన ఒక యువకబృందం సభ్యులంతా తప్ప తాగిన మైకంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకొచ్చిన బాణాసంచాలను తన తలపై పెట్టుకుని డీజే సాంగ్స్ తో చిందులు వేస్తూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాటిని పేల్చుతూ స్టంట్ చేశారు. దీంతో కొద్దిసేపు గణపతి ఊరేగింపు చూసేందుకు వచ్చిన భక్తులంతా ఒక్కసారిగా భయం భయంగా గడిపారు. అక్కడే ఉన్న కొందరు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని నెటిజెన్లు మండిపడుతున్నారు.