- హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- 9వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు
- వంద పడకల ఆసుపత్రిగా పెద్దపల్లి దవాఖాన అప్‌గ్రేడ్
- మంథనికి ౫౦ పడకల సీహెచ్‌సీ మంజూరు
- సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి)/పెద్దపల్లి: ప్రజాపాలన విజయో త్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెద్దపల్లిలో ‘యువ వికాసం’ విజ యోత్సవ సభ నిర్వహించనున్నది. వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై, ప్రభుత్వ కొలువులు సాధించిన 9 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.
వీరిలో గ్రూప్ ఎంపికైన వారు 8,143 మంది కాగా మిగిలిన వారు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణి కొలువులు సాధించిన వారున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములయ్యే ౭ ఏజెన్సీల ఒప్పంద పత్రాలపై సీఎం సంతకం చేయనున్నారు. డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్‌తోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. యువవికాసం సభ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపల్లి అభివృద్ధికి వరాలు కురిపించారు.
పెద్దపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్, మహిళా పోలీస్ స్టేష న్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌తోపాటు ఎలిగేడు లో పోలీస్‌స్టేషన్‌ను మంజూరు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎలిగేడుకు వ్యవసాయ మార్కెట్, పెద్దపల్లి 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఆప్‌గ్రేడేషన్ రూ.51 కోట్ల అంచనాలతో పరిపా లన ఆమోదం లభించింది. మంథనిలో 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ. 22 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తర్వులు జారీచేసింది.
గుంజపడుగలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెద్దపల్లిలో పోర్‌లేన్ బైపా స్ రోడ్డుతోపాటు దాదాపు రూ.352 కోట్ల తో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు, రూ.10 కోట్ల అంచనాలతో సబ్‌స్టేషన్ల పను లు, రామగుండంలో రూ.26 కోట్లతో చేపట్టిన నర్సింగ్ కళాశాలను ప్రజా పాలన విజ యోత్సవాల్లో భాగంగా ప్రారంభించనున్నా రు.
రూ.10 కోట్లతో శాతవాహన వర్సిటీ అకాడమిక్ బ్లాక్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సభకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు పలువురు మంత్రులు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరమణారావు హాజరుకానున్నారు. సుమారు లక్ష మంది సీఎం సభకు హాజరవుతారని అధికారులు అంచనా వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. రామగుండం నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ధర్మారం ఎక్స్‌రోడ్డు నుంచి కుక్కలగూడురు, రాజారాంపల్లి, ధర్మారం, చొప్పదండి నుంచి కరీంనగర్ వైపు వెళ్లాలని సూచించారు.
మంథని నుంచి కరీంనగర్ వెళ్లే వాహనాలు అప్పన్నపేట, ధర్మారం ఎక్స్ రోడ్డు నుంచి చొప్పదండి గుండా కరీంనగర్ వైపు వెళ్లాలని చెప్పారు. కరీంనగర్ నుంచి రామగుండం, మంథని వైపు వచ్చే భారీ వాహనాలు ముగ్దుంపూర్ ఎక్స్ రోడ్డు నుంచి చొప్పదండి, ధర్మారం, రాజారాంపల్లి, కుక్కలగూడురు, ధర్మారం ఎక్స్ రోడ్డు గుండా రాజీవ్ రహదారికి చేరుకోవాలని సూచించారు.
పెద్దపల్లి దవాఖానకు 100 పడకలు
పెద్దపల్లి జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేయనున్నది. అలాగే మంథని నియోజకవర్గానికి కొత్తగా 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం జీవో జారీచేసింది.
గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్దపల్లి హాస్పిటల్ అప్‌గ్రేడ్‌కు రూ.51 కోట్లు , మంథని సీహెచ్‌సీ నిర్మాణానికి రూ.22 కోట్లు, గుంజపడుగు పీహెచ్‌సీకి రూ.2.45 కోట్లు విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించునున్న నేపథ్యంలో ఈ మూడు హాస్పిటళ్ల పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు.
ప్రభుత్వ తొలి ప్రాధాన్యం విద్య, వైద్యానికే అని సోమవారం ఆరోగ్య ఉత్సవాల సందర్భంగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి మరుసటి రోజే మూడు హాస్పిటళ్లకు సంబంధించిన ప్రకటన వెలువడటం విశేషం.
మాట నిలబెట్టుకున్న మంత్రి శ్రీధర్‌బాబు
పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయరమణారావును గెలిపిస్తే పెద్దపల్లికి బైపాస్ రోడ్డు తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మంత్రి బైపాస్ రోడ్డు పనులకు ప్రభుత్వం నుంచి రూ.82 కోట్లు విడుదల చేయించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో పెద్దపల్లి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరనున్నది. బైపాస్ రోడ్డు మంజూరుపై పెద్దపల్లివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.