06-04-2025 12:01:57 AM
సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టాలి
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంలా యూత్ కాంగ్రెస్ పని చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. గాంధీభవన్‌లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్‌రెడ్డి అధ్యక్షతన శనివారం స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేశారని, కాంగ్రెస్ అభివృద్ధిపై ప్రచారంలో యూత్ కాంగ్రెస్ పాత్ర అంతగా లేదని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో యూత్ కాంగ్రెస్ అగ్రెసివ్‌గా వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని, లోకల్ బాడీలో రాణించాలంటే ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలన్నారు. జై బాపు, జై భీమ్ ,జై సంవిధాన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని, రాజీవ్ యువ వికాసంపై యువతలో యూత్ కాంగ్రెస్ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.