- వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో గేమింగ్ పాలసీ
- ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 14 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. నాయకత్వ శిక్షణ, పరిశోధన, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనర్లకు శిక్షణనిచ్చే ఈ కేంద్రం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
గురువారం హైటెక్‌సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పళనివేల్ తియాగరాజన్‌తో కలిసి శ్రీధర్‌బాబు మాట్లాడారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నందున ఎక్సలెన్స్ సెంటర్ వల్ల యువతకు మేలు జరుగుతుందని వెల్లడించారు. ముంబై తరహాలో రాష్ట్రానికి కూడా ఒక కేంద్రాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ ఒకటని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ల పరిశ్రమ విషయంలో హైదరాబాద్‌ను విస్మరించిందని ఆరోపించారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్ పాలసీని విడుదల చేస్తుందన్నారు.