న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో యువ క్రికెటర్లకు కొత్త ప్రమాణాలు నిర్దేశించిన ఘనత రోహిత్, కోహ్లీ, జడేజాలదని ఎన్‌సీఏ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కొనియాడాడు. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ త్రయంపై లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. ‘ ముగ్గురు ఆటగాళ్లకు నేనిచ్చే సందేశం ఇదే. కోహ్లీ, రోహిత్, జడేజా ప్రతిభావంతులు. ఈ త్రయం యువతరానికి అద్భుతమైన ప్రమాణాలు నిర్దేశించారు.
దశాబ్ద కాలం పాటు భారత క్రికెట్‌లో ఉత్సాహంగా ఆడిన తీరు భావి తరాలకు ఆదర్శం. టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ మిగిలిన ఫార్మాట్లలో తమ కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగించాలని ఆశిస్తున్నా. రాహుల్ భయ్యా, నేను చాలా ఏళ్ల పాటు కలిసి క్రికెట్ ఆడాం. రోహిత్, కోహ్లీలు కలిసి ద్రవిడ్‌కు టైటిల్ అందించడం గ్రేట్ మూమెంట్.
కప్ అందుకున్న క్షణంలో ద్రవిడ్ పలికిన హావభావాలు.. అతడికి ఈ విజయం ఎంత ఆనందాన్ని ఇచ్చిందనేది చూపించింది. టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు అభినందనలు. ఇది సమష్టి విజయం. హార్దిక్ పాండ్యా, బుమ్రా ఇలా చెప్పుకుంటే పోతే జట్టులో ప్రతీ ఒక్కరు తమ పాత్రను సమర్థంగా పోషించారు. కప్ అందుకున్న ప్రతీక్షణం ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.