calender_icon.png 14 October, 2024 | 5:53 AM

మీ కరెంటు మీ చేతుల్లోనే

14-10-2024 03:08:14 AM

అన్నదాతలకు సోలార్ పంప్ సెట్లు

ఉప ముఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క

అశ్వారావుపేట, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం పైలట్ ప్రాజె క్టుగా పొలాల్లో సోలార్ పంప్‌సెట్లు ఏర్పాటు చేస్తున్నదని ఉప ముఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రైతులు పండించే పంటతో పాటు విద్యుత్ ఉత్ప త్తి  చేసి కూడా ఆదాయాన్ని ఆర్జించేందుకు సోలార్ విద్యుత్ పంపు సెట్ల ఏర్పాటుకు రూపకల్పన చేశామన్నారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ఆయన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణ శివారులోని పామాయిల్  ఫ్యాక్టరీలో రూ.36 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు తమ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లో  రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని స్పష్టం చేశారు.

దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఎప్పుడూ రైతుల కు చెందిన రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని, రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష వరకు చేస్తామని రుణమాఫీ బీరాలు పలికిందని, చివరకు అది కూడా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.

పైగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుతంపై ఆ పార్టీ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. బీఆర్‌ఎస్‌కు రుణమాఫీ పొందిన రైతులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అర్హత ఉన్న వారు వెంటనే రుణమాఫీ కోసం వ్యవసాయ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పంట బీమాకు రైతులు చెల్లించాల్పిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నదని స్పష్టం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయిల్‌పాం సాగును  కేవలం భద్రాద్రి జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర నలుమూలలకూ విస్తరిస్తామన్నారు. 

ఆయిల్‌పాంకు కేరాఫ్ భద్రాద్రి: తుమ్మల

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రాలోని పెదవేగిలో తొలిసారి ఆయిల్‌పాం మొక్కల పెంపకం ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో క్రమంగా ఆయిల్‌పాం తోటల పెంపకం ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం ఆయిల్‌పాం తోటలకు కేరాఫ్‌గా భద్రాద్రి జిల్లా నిలవడం ఆనందాన్నిస్తోందన్నారు. వచ్చే నెలలో ప్రస్తుతం అమలవుతున్న టన్ను పామాయిల్  ధరను మరో రూ.వెయ్యి పెంచుతామన్నారు. జిల్లాలో భూమి పట్టాల  బదిలీలు ఉండవని స్పష్టం చేశారు.  

బీఆర్‌ఎస్ ఓర్వలేకపోతున్నది: పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సహయ సహకారాలను చూసి బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ధరణి పేరుతో అస్తవ్యస్తంగా భూరికార్డులను నమోదు చేసిందని విమర్శించారు. ధరణిని ప్రక్షాళన చేయడమే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలనిఅభిప్రాయపడ్డారు.