calender_icon.png 19 January, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా గొల్లలకు నీ తోడినేస్తమే సిరిసంపద

13-01-2025 12:00:00 AM

జన్మజన్మలకు నీ సాపత్యం, సాంగత్యం, బాంధవ్యం కావాలని అడుగుతున్నారు 29వ పాశురంలో. సాయుజ్యం కావాలని మనసారా కోరాలి. సంసారం నుంచి దూరమై, భగవంతుడిని చేరి భగవదనుభవం పొందుగాక. ఇన్నాళ్లూ పఱై కావాలని గోపికలు కోరుకున్న ప్రస్తావన కనిపిస్తుంది. నిన్న పఱై, అలంకార వస్తువులు, పరమాన్న భోజనం అడిగిన గోపికలు కాని ఆ పఱై శ్రీకృష్ణుని శ్రీచరణాలే కాని మరేదీ కాదు.

నీ కైంకర్యమే పరమ పురుషార్థమని గోపికలు తేల్చారు. భగవంతుడిని పొందడానికే ఈ వ్రతం. ముందు భగవత్ సంబంధులతో సంబంధం ఏర్పరచుకోవాలి. శమము దమము అనే గుణాలను అలవర్చుకుని ఆచార్యుని వద్ద సమాశ్రయణం పొందాలి. వారినుంచి మంత్రోపదేశం పొంది, మంత్రార్థం తెలుసుకుని, పురుషకారం కట్టుకొమ్మని అమ్మను ఆశ్రయించాలి.ఆమెద్వారా స్వామియే ఉపాయమని వారి కటాక్షం సంపాదించాలి.

స్వామిని దర్శించి మంగళాశాసనం చేసి, స్వరూపం జ్ఞానం మొదలైనవి కావాలని కరుణించి దయ చేయమని అడగాలి. అందుకు కావలసిన అలంకారాలు ఇవ్వమని అడిగి అవి ధరించి సాయుజ్యం కావాలని మనసారా కోరాలి. సంసారం నుంచి దూరమై, భగవంతుడిని చేరి భగవదనుభవం పొందే ప్రక్రియను 27 పాశురాలలో వివరించారు. ప్రధానంగా నారాయణనే నమస్కారం అని నారాయణుడే మనకు పఱై అనే వాయిద్యం ఇస్తారని మొదటి పాశురంలో చెప్పి వ్రతం ఆరంభించారు.

ధర్మ అర్థ కామ మోక్షాలలో మొదటి మూడు నాలుగవ పురుషార్థమును పొందడానికి మెట్లు. అందుకే, నారాయణుడే ఫలం ఇస్తాడని, ఫలమే పఱై అని 28, 29 పాశురాలలో వివరించారు. భగవంతుడు తప్ప మరొక ఉపాయం ఉందనుకోరాదు.

అనుకుంటే అది మురికి (అపరిశుద్ధత), భగవంతుడు ప్రాప్తించిన తరువాత వేరొక ప్రయోజనం అడగడం మరొక అపవిత్రత. భగవంతుని కైంకర్యం తన కోసం అనుకుంటే అది మరొక అపవిత్రత. ఈ అపవిత్రతలన్నీ తొలగించుకోవడమే ఫలశుద్ధి. నీవే ఉపాయమనేది ఒక పరిశుద్ధి. నీవే ఫలమనేది ఫల పరిశుద్ధి. 28వ పాశురంలో ఉపాయ పరిశుద్ధి, 29పాశురంలో ఫల పరిశుద్ధి ప్రధానం. నోము ఒక మిష, పఱ ఒక మిష. వారికి నిజంగా కావలసింది శ్రీకృష్ణసేవ.

తెల్లవారు ఝాముకన్నా ముందటి బ్రాహ్మీ ముహూర్తంలో (శిట్రం శిరుకాలే), వచ్చి(వందు), నిన్ను సేవించి (ఉ న్నైశేవిత్తు), నీ అందమైన పాద కమలాలకు(ఉన్ పొన్ తామరై అడి), మంగళాశాసనం చేయడానికి గల ప్రయోజనాన్ని (పొట్రుమ్ పొరుళ్), వినాలి (కేళాయ్), పశువులను మేపి (పెట్రమ్ మేయ్ త్తు), జీవించే(ఉణ్ణు మ్), యాదవకులంలో (కులత్తిల్), జనించి (పిఱందు), నీవు(నీ), మాచే (ఎంగళై), ఆంతరంగిక కైంకర్యాన్ని(కుట్రేవల్), స్వీకరించకుండా ఉండడం తగదు(కొళ్లామల్ పోగాదు),

ఈరోజు (ఇట్రై), నీవు కరుణించి ప్రసాదిస్తున్న పఱైని తీసుకోవడానికి వచ్చిన వారిమి కాము (పఱై కొళ్వాన్ అన్ఱు కాణ్). ఓ గోవిందా (గోవిందా) ఈ కాలమున్నంత వరకు(ఎట్రైక్కుమ్), ఏడేడు జన్మలకు(ఏజేజ్ పిఱ విక్కు మ్), నీతోనే(ఉన్ తన్నోడు), సంబంధం కలిగిన వారై ఉంటాము(ఉట్రేమే ఆవోమ్), నీకు మాత్రమే(ఉనక్కే), మేము(నామ్), దాస్యం చేయాలని కోరుకుంటున్నాము(ఆట్చెయ్ వోమ్),

మా (నమ్), తదితర కోరికలు(మాట్రైకామంగళ్), పోగొట్టాలి(మాట్రు), ప్రాతఃవేళలు మూడు (కాలై, చిరుకాలై, శిట్రం శిరుకాలై), తామసులు లేచే వేళ(కాలై), గోపస్త్రీలు చేరుకుని చల్ల చిలికే వేళ(చిరుకాలై), దానికన్నా ముందుగా గోపబాలికలు లేచిన వేళ (శిట్రం శిరుకాలే). శ్రీకృష్ణుడి వియోగ దుఃఖం అనే చీకటి పోగొట్టడానికి ఉదయించే సూర్యబింబా న్ని పోలిన ముఖం గల శ్రీకృష్ణుడిని చూడడానికి పోతున్నందున ఇదే ఉదయమై పోయింది. ‘ఆవిర్భూతమ్ మహాత్మానా’ అంటే భగవంతుడు ఆవిర్భవించిన అర్ధరాత్రి కూడా ఉదయకాలమే అవుతుంది.