సూర్యాపేట: సాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు గల్లంతయిన ఘటన జిల్లాలోని గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హుజూర్ నగర్ పట్టణానికి చెందిన లచ్చమల్ల వెంకట్(21) అనే యువకుడు వెలిదం గ్రామంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యాడు.
గ్రామం పక్కనే ఉన్న సాగర్ ఎడమ ప్రధాన కాలువలోకి స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి కాలవలో పడి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వెంకట్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వెంకట్ హుజూర్నగర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం.