పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రేమ పెళ్లి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లై భర్తతో కాపురం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లియైన ఓ వివాహిత, ప్రేమ మోజులో పడి యువకుడితో కాపురం చేస్తూ.. ఆ యువకుడి మరణానికి కారణమైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 8వ కాలనిలో హనుమాన్ నగర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి టూటౌన్ సీఐ ప్రసాదావు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సెక్టార్-3 డిస్పెన్షరీలో స్కావెంజర్గా పని చేస్తున్న వడ్డాది కుమార్ టీ2 క్వార్టర్ లో నివాసము ఉంటున్నాడు. ఇతని కుమారుడు వడ్డాది వినయ్ కుమార్ (27) గోదావరిఖని సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కాంట్రాక్టు స్కావెంజర్గా పని చేస్తూ గోదావరిఖని బాపుజీనగర్ కు చెందిన పెండ్లైన యువతి అంజలీతో ప్రేమలో పడ్డాడు.
దీంతో ఆమె భర్త కుటుంబ సభ్యులు గోదావరిఖని-1 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా పోలీసుల సమక్షంలో ఆమె ప్రేమించిన యువకుడితో ఉంటానని చెప్పింది. మూడు నెలలుగా వారిద్దరు హనుమాన్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ పండుగపూట యువతి అన్న ఫోన్ చేసి నిన్ను కలిసి వెళ్లుతానని చెప్పడంతో ఆమె ఇంటి అడ్రస్ చెప్పి రమ్మంది. పథకం ప్రకారం మాజీ భర్తతో కలిసి వచ్చిన యువతి అన్న ఇంట్లో మాట్లాడుతునే వినయ్ కుమార్ పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. ఎదిగి వచ్చిన కుమారుడు కండ్ల ఎదుటే హత్య గావించడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన సీఐ ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం పిలిపించి ఆధారాలను సేకరిస్తున్నారు. హత్య చేసిన నిందితులను త్వరలో ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని సీఐ తెలిపారు.