హైదరాబాద్,(విజయక్రాంతి): పేమ, పెళ్లి పేరుతో బుల్లితెర నటిని ఓ యువకుడు వేధించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee Hills Police) గురువారం అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ(29) యూసుఫ్ గూడలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఓ సీరియల్ షూటింగ్ సమయంలో బత్తుల ఫణి తేజ అనే యువకుడితో పరిచయం ఏర్పాడింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ లో మహిళను పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడంతో తనకు ఇంతకు ముందే వివాహం అయిందని, భర్తను దూరంగా ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పింది.
పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఉక్రోషంతో వివాహితకు అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపించాడు. అంతకు స్పందించకపోవడంతో మహిళ అత్తింటి వారికి తన గురించి చెడుగా చెప్పాడు. ఇక ఫణితేజ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తన ప్రవర్తన కారణంగానే ఇదంతా జరిగిందని పేర్కొంటూ నిందితుడు మహిళ ఫోన్ కు సెల్ఫీ వీడియో పంపిస్తూ కాళ్ల బేరానికి వచ్చాడు. బాధితురాలి క్యారెక్టర్ ను దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేయడంతో ఫణితేజను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు పేర్కొన్నారు.