calender_icon.png 24 February, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువులోపు యంగ్ ఇండియా స్కూళ్లు

15-02-2025 01:45:53 AM

  1. రవాణా సౌకర్యం ఉన్న స్థలాలను ఎంచుకోవాలి
  2. పనులపై కలెక్టర్ల పర్యవేక్షణ తప్పనిసరి
  3. ‘చాకలి ఐలమ్మ వర్సిటీ’ పనుల్లో రాజీ వద్దు
  4. ప్రాంగణంలోని చారిత్రక కట్టడాలను కాపాడాలి
  5. విద్యాశాఖ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): నిర్దేశిత గడువులోపు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గంలో స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేశామని, మార్చి 20న పనులు ప్రారంభిస్తామని సీఎంకు వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మిగతా నియోజకవర్గాల్లోనూ భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని, ఉమ్మడి జిల్లాలకు నియమితులైన సీనియర్ అధికారులు ఆ పనులను పర్యవేక్షించాలని సూచించారు.

రాకపోకలకు సులువుగా ఉన్న ప్రాంతాల్లోనే స్కూళ్లు నిర్మించాలన్నారు. నిర్మాణాలు యూనివర్సిటీ స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. పనులను ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. రెండు రోజులకోసారి పనులు, భూసేకరణ ప్రక్రియ అంశాలను సమీక్షించాలని సూచించారు.

పనులపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది కోసం నర్మించే భవనాలు పక్కాగా ఉండాలని సీఎం అన్నారు.

నిర్మాణ పనుల్లో రాజీపడొద్దన్నారు. గదులు, ల్యాబ్‌లు, ప్లేగ్రౌండ్ సౌకర్యాలు ఉండాలన్నారు. ఖర్చు సంగతి ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. వర్సిటీ ప్రాంగణంలోని చారిత్రక, పురాతన కట్టడాలను పరిరక్షించాలని, వాటికి అవసరమైన మరమ్మతుల విషయంలో పురావస్తు శాఖ అధికారులతో చర్చించాలని సూచించారు.

అనంతరం భవన నిర్మాణాలపై సీఎం అధికారులకు సలహాలు, సూచనలిచ్చారు. సమీక్షలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంఆర్డీసీ ఎల్ జాయింట్ ఎండీ పి.గౌతమి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డి, చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ్ పాల్గొన్నారు.