calender_icon.png 13 October, 2024 | 4:53 AM

ఫైనల్లో యువ భారత్

29-09-2024 12:00:00 AM

భూటాన్: సాఫ్ అండర్-17 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్ చేరింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో యంగ్ ఇండియా 4-2 తేడాతో నేపాల్‌ను మట్టికరిపించింది. భారత్ తరఫున విశాల్ యాదవ్ (ఆట 61, 68వ నిమిషంలో) డబుల్ గోల్స్‌తో మెరవగా.. రిషి సింగ్ (85వ ని.లో), లంకిమ్ (90+5వ ని.లో) గోల్స్ సాధించారు.

ఇక నేపాల్ తరఫున సుభాశ్ బామ్ (81వ ని.లో) గోల్ సాధించగా.. భారత ఆటగాడు మొహమ్మద్ కైఫ్ (89వ ని.లో) సెల్ఫ్ గోల్ చేయడంతో నేపాల్ ఖాతాలో రెండో గోల్ వచ్చి చేరింది. బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ విజేతతో భారత్ సోమవారం ఫైనల్లో తలపడనుంది. 

విశాల్ అదుర్స్..

మొదటి అర్ధ భాగంలో గోల్ చేయకపోయినా కానీ రెండో హాఫ్లో మనోళ్లు చెలరేగిపోయారు. ఫస్టాఫ్‌లో ఎన్నో అవకాశాలు వచ్చినా మన ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. విశాల్ యాదవ్ రెండు గోల్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు.భారత్‌కు ఆట మొదలైన 12వ నిమిషంలోనే గోల్ చేసే అవకాశం లభించినా కానీ మన ఆటగాళ్లు బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంలో విఫలం అయ్యారు.

ఆట మొదలైన గంట తర్వాత కానీ మొదటి గోల్ నమోదు కాలేదు. మొదటి గోల్ లభించిన ఏడు నిమిషాల వ్యవధిలోనే ఇండియా మరో గోల్ సాధించింది. దాంతో ఆధిక్యం 2 చేరుకుంది. తర్వాత నేపాల్ గోల్ చేసి పోటీలోకి వచ్చినట్లు కనిపించినా కానీ మనోళ్లు  గోల్స్ సాధించడంతో నేపాల్ ఓటమిని అంగీకరించక తప్పలేదు.

2022లో చాంపియన్‌గా నిలిచిన భారత్ ఇప్పటికే ఐదు సార్లు సాఫ్ అండర్-17 టైటిల్‌ను దక్కించుకోవడం విశేషం. ఆరోసారి టైటిల్ అందుకొని యువ భారత్ చరిత్ర సృష్టించాలని కోరుకుందాం.