కొడుకును ఆటపట్టించిన బాబాయ్
అజిత్, రోహిత్ పవార్ మధ్య సంభాషణ
ముంబై, నవంబర్ 25: ‘నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను ప్రచారం చేసి ఉంటే అక్కడ నువ్వు గెలిచేవాడివి కావు.. రిజల్ట్ మరోలా ఉండేది. నేను అక్కడికి రాకపోవడం వల్లే నువ్వు గెలిచావు’ అని తన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్‌ను ఉద్ధేశించి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అన్నారు. మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్ వర్ధంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్, ఆయన సోదరుడి కుమారుడు, శరద్ పవార్ (ఎస్పీ) పార్టీ నేత రోహిత్ కుమార్ హాజరయ్యారు.
ఈసందర్భంగా తనకు ఎదురుపడిన రోహిత్‌ను ఉద్ధేశించి ‘ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేను ఖజరత్ జమ్ఖేడ్లో ప్రచారం చేసి ఉంటే అక్కడ ఫలితం ఎలా ఉండేదో తెలుసా” అని అజిత్ సరదాగా అన్నారు. దీంతో అజిత్ కాళ్లకు రోహిత్ నమస్కరించారు. అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా అజిత్ పవార్ తనకు తండ్రితో సమానమని అన్నారు.
గతంలో తాను గెలవడానికి బాబాయి ప్రచారం చేశారని పేర్కొన్నారు. కాగా ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ తరపున రోహిత్ పోటీచేసి బీజేపీ అభ్యర్థిపై 1,234 ఓట్ల తేడాతో విజయం సాధించారు.