calender_icon.png 18 January, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్ కాగానే వెళ్లిపోతావ్.. నేను లోకల్

14-08-2024 12:19:08 AM

  1. ఇలాంటి అధికారులను ఎంతోమందిని చూశా 
  2. ఉద్యోగం ఇష్టం లేకనే నాపై కేసు నమోదు 
  3. హైడ్రా అధికారులకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తా 
  4. నందగిరి హిల్స్ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఎమ్మెల్యే దానం ఆగ్రహం 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): ‘గతంలో ఎంతోమంది ప్రభుత్వ అధికారులను చూశాను.. నువ్వు రిటైర్ కాగానే నీ ఊరికి వెళ్లిపోతావ్.. నేను లోకల్.. ఇక్కడే పుట్టి పెరిగినోళ్లం.. ఉద్యోగం చేయడం ఇష్టం లేని కారణంగానే ఇక్కడి నుంచి వెళ్లి మంచి పోస్టింగ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నాపై కేసు నమోదు చేశారంటూ’ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ సర్కిల్ నందగిరి హిల్స్‌లోని పార్కు స్థలంలో నివాసాలు ఏర్పాటు చేశారని హైడ్రా అధికారులు స్థానిక నివాసాలను తొలగించారు. ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోత్సాహం ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హైడ్రా అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దానంపై పోలీసులు సోమవారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో హిమాయత్ నగర్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. నా నియోజకవర్గంలోని ప్రజల వద్దకు వెళ్లొద్దని చెప్పడానికి వీళ్లెవరంటూ ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేదనకుంటా.. ఇంతకంటే మంచి పోస్టింగ్ కావాలనే ఉద్దేశంతోనే నాపై కేసులు నమోదు చేశారంటూ హైడ్రా కమిషనర్‌పై మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేసి కేసు నమోదయ్యేలా వ్యవహరించిన అధికారులపై ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తానని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఫిర్యాదు చేస్తానని దానం పేర్కొన్నారు.

అధికారులు హద్దు మీరి ప్రవర్తించడం వాళ్లకు మంచిది కాదు.. మాకు మంచిది కాదంటూ పరోక్షంగా హెచ్చరించారు. తెలుగుదేశం హయాంలో నాపై 190 కేసులు నమోదయ్యాయి.. ఇంకెన్ని కేసులు నమోదయినా భయపడనని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈయనకేమైనా రాసిచ్చారా అంటూ ధ్వజమెత్తారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే తనపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయం వ్యక్తిగతంగా పోతుందంటూ పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి, కార్పొరేటర్ మహాలక్ష్మి, నాయకుడు రామన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.