calender_icon.png 16 March, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీతూ జీవిత కబుర్లు విని నివ్వెరపోవాల్సిందే!

16-03-2025 12:53:46 AM

నటి నీతూ సింగ్ చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా ప్రేక్షకుల మన్నలను పొందిన బాలీవుడ్ సీనియర్ నటి. 70లలో ఆమె హవా మాములుగా ఉండేది కాదు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రిషికపూర్‌ను వివాహ మాడి సినిమాలకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆమెకు 66 ఏళ్లు. అయినా ఈ ఏజ్‌లో కూడా యువ హీరోయిన్ల మాదిరిగా ఫిట్‌గా భలే కనిపిస్తుంది. 

నీతూ సింగ్ ‘సూరజ్’ అనే చిత్రంలో 1966లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘దో కలియాన్’ అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేసింది. ‘రిక్షావాలా’ (1973) చిత్రంతో పరిణతి చెందిన పాత్రలు చేయడం ఆరంభించింది. అలా ‘యాదోన్ కీ బారాత్’, దీవార్, ఖేల్ ఖేల్ మే, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, ధరమ్ వీర్, పర్వారిష్, జానీ దుష్మన్, కాలా పత్తర్ వంటి చిత్రాల్లో నటించింది. 

రిషి చాలా తుంటరివాడని.. 

రిషి కపూర్, నీతూల ప్రేమ ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ ఏమీ కాదు. వీరిద్దరూ 1974లో వచ్చిన ‘జెహ్రీలా ఇన్సాన్’ అనే సినిమా సెట్స్‌లో తొలిసారిగా కలిశారు. అప్పట్లో రిషి చాలా సరదాగా.. చిలిపిగా ఉండేవారు. నీతూని చాలా చికాకు పెట్టేవారట. ఆయన తుంటరివాడని భావించేదట. ఇక వీరిద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరం. రిషికి మరో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేది. ఆమె ఒకరోజు గొడవపడి దూరంగా వెళ్లిపోయింది.

తన గర్ల్ ఫ్రెండ్‌ను తిరిగి తన జీవితంలోకి తీసుకొచ్చేందుకు నీతూ సాయం కోరారట. తన ప్రేయసికి లెటర్స్ రాసేందుకు రిషికి నీతూ సాయపడేది. అలా రోజులు గడిచేకొద్దీ అసలు గర్ల్‌ఫ్రెండ్ మాట మరిచి నీతూని మిస్సవుతున్నానని తెగ ఫీలయ్యేవారు. ఈ విషయాన్ని నీతూకి చెప్పాడు. నీతూ కూడా తనకు తెలియకుండానే రిషి ప్రేమలో పడిపోయిందట.

అలా వారిద్దరూ అప్పటికే సైన్ చేసిన చిత్రాల షూటింగ్ ముగిసిన త ర్వాత 1980లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్నుంచే నీతూ సింగ్.. నీతూ కపూర్‌గా మారారు. వీరికి ఇద్దరు పిల్లలు. రిద్ధిమా కపూర్ సాహ్ని, రణబీర్ కపూర్. రిద్ధిమా ఫ్యాషన్ డిజైనర్. ఆమెకు ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్తతో వివాహం జరిగింది. రణబీర్ ఆలియా భట్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి రాహా కపూర్ అనే పాప ఉంది. 

టెలివిజన్ రంగంలోనూ..

‘లవ్ ఆజ్ కల్’ చిత్రంలో అతిథి పాత్రలో నటించింది. ‘జగ్ జగ్ జీయో’ చిత్రంలోనూ నటించింది. ఒక డ్యాన్స్ షోకి జడ్జిగా బుల్లితెరపై అడుగు పెట్టింది. 

ఏడేళ్ల వయసులో..

తెలుగులో హిట్ అయిన ‘లేత మనసులు’ హిందీ రీమేక్ ‘దో కలియా’తో బాలనటిగా స్టార్ అయ్యారు నీతూ సింగ్. దో కలియాకుగాను నీతూ ఆడిషన్స్‌లోనే సినిమా ఆఫర్ వచ్చింది. అప్పుడు ఆమె వయసు ఏడేళ్లు మాత్రమే. 

ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

ఇటీవల ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న నీతూ తన ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి బయటపెట్టింది. ఆరుపదుల వయసులో కూడా యంగ్‌గా.. ఫిట్‌గా ఉండటానికి కారణం ప్రోబయోటిక్ రెసిపీ ‘కంజి రైస్’ అని. ఇది దక్షిణ భారత వంటకం.