* డీజీపీ డాక్టర్ జితేందర్
* ముగిసిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలు
కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): జాతీయ స్థాయిలో జరిగే క్రీడల్లో తెలంగాణ పోలీస్ జట్లు మొదటి స్థానంలో నిలవాలని డీజీపీ డాక్టర్ జితేందర్ ఆకాంక్షించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు శనివారం ముగిశాయి.
కార్యక్రమానికి డీజీపీ హాజరై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పోలీస్‌పరంగా జాతీయస్థాయిలో జరిపిన ఓ సర్వే ప్రకారం జాతీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. ఆలిండియా డ్యూటీ మీట్ పోటీల్లోనూ తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారన్నారు.
రాష్ట్ర పోలీసులు జాతీయస్థాయి క్రీడల్లో పోటీపడి ప్రథమ స్థానం సాధించేలా కృషి చేయాలన్నారు. ఇకనుంచి యేటా పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంత భారీ సంఖ్యలో పోలీస్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందించారు.
రాష్ట్రస్థాయి తెలంగాణ పోలీసుల క్రీడా పోటీలను అద్భుతంగా నిర్వహించినందుకు ఐజీసీ స్పోర్ట్స్ రమేశ్, తక్కువ సమయంలో వసతులను కల్పించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, సిబ్బందిని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఐజీపీ స్పోర్ట్స్ రమేశ్‌రెడ్డి, మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి మాట్లాడారు. కార్యక్రమంలో కో డీఐజీ గజరావు భూపాల్, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర పాల్గొన్నారు.