* పింక్‌బుక్ పేరుతో రేవంత్‌రెడ్డిని రెచ్చగొడుతున్న ఎమ్మెల్సీ కవిత
* ఉనికి కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు
* పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత తన ఉనికి కోసమే రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దుయ్యబట్టారు. పింక్ బుక్ పేరుతో రేవంత్‌రెడ్డిని కవిత అనవసరంగా రెచ్చగొడుతున్నారని, గతంలో నరేంద్రమోదీని రెచ్చగొట్టడం వల్లే నాలుగు నెలలు జైలుపాలయ్యారని విమర్శించారు.
గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తోడేళ్లకు భయపడే పార్టీ కాంగ్రెస్ కాదన్నారు. బీఆర్‌ఎస్ పని ఖతం అయిందని అసలు ఆ పార్టీ ఫీల్డ్‌లోనే లేదని ఎద్దేవా చేశారు. ‘పాపం ఆడపిల్లవు మొన్ననే నాలుగు నెలలు జైలుకు వెళ్లొచ్చావు. మిమ్మ ల్ని జైలుకు పంపితే మాకూ బాధనిపించింది. చేసిన తప్పులంతా మీరేచేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుల చిట్టా రాయ డం ఏంటి..?’ అని ప్రశ్నించారు.
వారి వెంటపడుతూనే ఉంటా..
కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కోతలరాయుళ్లని వాళ్లకు కోతలు ఎక్కువ.. పని తక్కువ అని జగ్గారెడ్డి విమర్శించారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఐటీఐఆర్ ఇవ్వలేకపోయిందని, రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్ దాన్ని సాధించడంలో విఫలమైందన్నారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు ఐటీఐఆర్ తెచ్చి తమ మగతనం చూపించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నేను పదవులు అడుక్కోను..
పదవులు అడిగి తీసుకునే సంప్రదాయం తనకు లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తన అవసరం పార్టీకి ఉంటే హైకమాండ్ పిలిచి పోస్టు ఇస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశా రు. తనకు పోస్టు ఉన్నాలేకున్నా ప్రజల కోసం నిలబడతానన్నారు.