calender_icon.png 11 October, 2024 | 5:54 AM

ఏపీకి వెళ్లాల్సిందే!

11-10-2024 03:01:42 AM

ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్రం ఆదేశం

  1. తెలంగాణకు కేటాయించాలని కోరిన అధికారులు 
  2. అధికారుల అభ్యర్థన తిరస్కరణ 
  3. 16వ తేదీలోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు 
  4. కేడర్ విభజనపై  కేంద్రం కీలక నిర్ణయం

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన అధికారులందరూ ఏపీకి వెళ్లాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తెలంగాణ, ఏపీ కేడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రానికి తమను కేటాయిం చాలన్న అధికారుల వినతిని కేంద్ర తిరస్కరించింది. తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయా అధికారులను వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆమ్రపాలి కాట, రొనాల్డ్ రోస్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతి, ఐపీఎస్‌లు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.

అయితే వీరి అభ్యర్థనను కేంద్రం కొట్టివేసింది. వీరందరినీ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ (కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది.అంతేకాకుండా ఈనెల 16లోగా ఏపీలో వీరంతా రిపోర్టు చేయాలని ఆదేశించింది. 

ఏపీలో పనిచేస్తున్న వారు కూడా..

అదేవిధంగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్‌ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్‌లను సైతం రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణకు అధికారులను కేంద్రం సర్దుబాటు చేసింది. అయితే వీరిలో కొందరు అధికారులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

తమను తెలంగాణ కేడర్‌కు మార్చాలని వివిధ కారణాలను చూపించారు. గతంలో ఇదే విషయంపై వీరు క్యాట్‌ను సైతం ఆశ్రయించారు. క్యాట్ వీరి అభ్యర్థనను అంగీకరించింది. అయితే క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ  తెలంగాణ హైకోర్టులో కేం ద్రం పిటిషన్ దాఖలు చేసింది. గత మార్చి నెలలో దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే అభ్యంతరాల పరిశీలన కోసం కేంద్రం విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్ ఖందేకర్‌ను నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈనెల 16లోగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఆదేశాలను కేంద్రం జారీ చేసింది.

తెలంగాణలో పనిచేస్తున్న 

ఏపీ అధికారులు

అమ్రపాలి కాట జీహెచ్‌ఎంసీ 

కమిషనర్

రోనాల్డ్ రోస్ విద్యుత్ శాఖ 

కార్యదర్శి

వాణీప్రసాద్ పర్యాటక, సాంస్కృ

తిక శాఖ ముఖ్య 

కార్యదర్శి

వాకాటి కరుణ స్త్రీ,శిశు సంక్షేమ 

శాఖ ప్రత్యేక కార్యదర్శి

మల్లెల ప్రశాంతి తెలంగాణ ఆయుష్ 

డైరెక్టర్

ఐపీఎస్‌లు 

అంజనీ కుమార్ ప్రింటింగ్, స్టేషనరీ 

అండ్ స్టోర్ పర్చేస్ 

కమిషనర్

అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ 

అకాడెమీ డెరెక్టర్

అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ 

కమిషనర్