calender_icon.png 22 November, 2024 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మమ్మల్ని అడగాల్సిందే!

22-11-2024 12:14:13 AM

  1. ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా ఎలా ఇస్తారు?
  2. రాష్ట్రాన్ని సంప్రదించకుండానే అనుమతులెలా?
  3. యూజీసీకి లేఖ రాసిన ఉన్నత విద్యామండలి
  4. అటానమస్ కాలేజీలతో తగ్గుతున్న విద్యాప్రమాణాలు

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాం తి): రాష్ట్రంలోని ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇబ్బడిముబ్బడిగా అటానమస్ హోదా ఇవ్వడంపై ఉన్నత విద్యామండలి తీవ్ర అభ్యంత రం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఇష్టానుసారంగా తమ పరిధిలోని కాలేజీలకు అనుమతులు ఇవ్వడంపై గుర్రు గా ఉంది.

విద్యాప్రమాణాలు ఇతరత్రా అం శాల విషయంలో తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దరఖాస్తు చేసు కున్న కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. ఈమేరకు యూజీసీకి ఉన్నత విద్యామండలి లేఖ రాసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవే ట్ ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదాను యూజీసీ ఇస్తోంది.

అయితే వర్సిటీ కాలేజీల తర్వాత తల్లిందండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపేది అటా నమస్ కాలేజీల్లోనే. ఆ కాలేజీల్లో చదివితే సులువుగా పాస్ అవుతారనే ధీమా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది.

అందుకే ఈమధ్య కాలంలో అటానమస్ కాలేజీల్లో సీట్లు ఎక్కువగా నిండుతు న్నాయి. తమకు సమాచారం ఇవ్వకుండా అనుమతులిస్తే ఏమైనా ఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత అంటూ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

గ్రేడ్‌లో మార్పులతోనే చిక్కులు..

అటానమస్ హోదా కోసం ఇంజినీరింగ్, డిగ్రీ, ఇతర కాలేజీలు యూజీసీకి భారీగా దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఈ హోదా ఉన్న కాలేజీలకు మంచి డిమాండ్ ఉండడంతో అరకొర వసతులు ఉండే కాలేజీలు సైతం యూజీసీ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి.

అయి తే గతంలో నేషనల్ అస్సెస్‌మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ‘ఏ’ గ్రేడ్ లేదా కనీసం మూడు కోర్సులు 675 స్కోర్‌తో ఎన్‌బీఏ గుర్తింపు కలిగి ఉంటే అటానమస్ హోదాను కల్పించేంది. ప్రస్తుతం పదేళ్ల వరకు అటానమస్ హోదాను కల్పిస్తున్నారు. దీనికితోడూ ‘ఏ’ గ్రేడ్ ఉండడానికి బదులు ‘బి’ గ్రేడ్‌కు నిబంధనలను యూజీసీ కుదించింది.

‘బి’ గ్రేడ్ అంటేనే అరకొర సౌకర్యాలు, వసతులు ఆయా కాలేజీల్లో ఉంటాయి. ఫ్యాకల్టీ, ల్యాబ్ సౌకర్యాలు సరిగా ఉండకపోవడం లాంటివి సమస్యలుంటాయి. వీటికి కూడా అటానమస్ హోదా ఇస్తే విద్యాప్రమాణాలు దెబ్బతింటాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి అభిప్రాయం.

తమ రాష్ట్రంలోని కాలేజీలకు అటానమస్ హోదా ఇచ్చే ముందు తమను సంప్రదించాలని అధికారులు చెప్తున్నారు. న్యాక్ గుర్తింపు పొందిన ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలు కలిపి సుమారుగా 430 వరకు ఉంటాయని అంచనా.

సొంతంగానే పరీక్షలు

అటానమస్ హోదా ఉండే కాలేజీ ల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థు లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా విద్యాసంస్థలు సొంతంగా ప్రవేశాల నిబంధనలు రూపొందించుకొని వాటిని అమలు చేసుకునే వీలుంటుం ది. వర్సిటీల పెత్తనం పెద్దగా ఉండదు. సొంతంగా పరీక్షలు నిర్వహించుకొని ఆయా కాలేజీల్లోనే జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. కేవలం డిగ్రీలను మాత్రమే వర్సిటీలిస్తాయి.

అటా నమస్ కాలేజీల్లో చదివితే సులువుగా పాస్ కావొచ్చని, ఫెయిల్ చేయరనే అభిప్రాయం విద్యార్థుల్లో ఉంది. యూజీసీ మాత్రం కాలేజీలు సమర్పించే దరఖాస్తుల్లోని వివరాలు, సంబంధిత వర్సిటీ ఎన్‌వోసీ ఆధారంగా అటానమస్ హోదా ఇస్తోంది.

గతంలోనూ ఇంజినీరింగ్‌లో సీట్ల పెంపు, కొత్త సీట్ల అనుమతులకు ఏఐసీటీఈ అనుమతులివ్వడంతో దీనిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకు అనుమతులివ్వలేదు. ఈ విషయంలోనూ గతంలో ఏఐసీటీఈకి తెలంగాణ ఉన్నత విద్యామండలి లేఖను రాసింది.