- దాయాది కర్కశంతో కూలీగా మారిన పన్నెండెకరాల ఆసామి
- వెనుక ఉన్న పొలాలకు తోవ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న భూస్వామి
- దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూమికీ దారి ఇవ్వని వైనం
హుస్నాబాద్, డిసెంబర్ ౧౧: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో ఓ భూస్వామి దుశ్చర్యతో భూమి కలిగిన కొందరు రైతులు నిరుపేదలుగానే కాలం వెల్లదీస్తున్నారు. ఆ బడారైతు కర్కశానికి బలైపోయి కూలీలుగా బతుకుతున్నారు.
గ్రామా నికి చెందిన ఎడమల హరీశ్‌రెడ్డి తన దాయా ది ఎడమల రాజిరెడ్డితోపాటు దళితులైన జెల్ల పోచవ్వ, లింగాల స్వరూప, లింగాల యాదమ్మను వారి భూముల్లోకి పోనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. దీంతో ఏడేళ్లుగా తమ భూములు, బతుకులు పడావు పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.
ఎడమల రాజిరెడ్డికి రామవరం గ్రామంలో 12 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఆయనకు అతడి తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చింది. దానిపై ఆధారపడే వ్యవసాయం చేసుకుంఊట అతడు, అతడి భార్య జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం కావడంతో తమలాగా వారు ఉండవద్దని తమ కష్టార్జితంతో వారిని ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
బాగుపడుతున్నాడనే అక్కసుతో..
తమ కంటే వైవిధ్యమైన పంటలతో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాడనే అక్కసుతో ఆయన దాయాది హరీశ్‌రెడ్డి కుట్రపన్ని రాజిరెడ్డి వ్యవసాయాన్ని దెబ్బతీశాడని గ్రామస్తులు చెబుతున్నారు.
సర్కార్ ఇచ్చిన భూమికీ తొవ్వ ఇస్తలేరు
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భూమి కొనుగోలు, పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి కొనివ్వాలి. మహిళల పేరుమీద పట్టా ఇవ్వాలి. అయితే రామవరంలో ఈ పథకం కింద దళితులు జెల్ల పోచవ్వ, లింగాల స్వరూప, లింగాల యాదమ్మకు ఒక్కొక్కరికి రెండున్నర ఎకరాలలోపే కొనుగోలు చేసి ఇచ్చింది.
2017లో గ్రామానికి చెందిన ఎడమల బాల్‌రెడ్డి నుంచి పోచవ్వకు 2.23 ఎకరాలు, స్వరూపకు 2.23ఎకరాలు, పోచవ్వకు 2.12ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి పంపిణీ చేసింది. ఆ భూముల ఎగువన ఉన్న భూస్వామి హరీశ్‌రెడ్డి తొవ్వ ఇవ్వకుండా అడ్డుకోవడం మరో కారణంగా ఉంది.
దినసరి కూలీలుగా ఉన్న తాము ఇక తమ సొంత భూముల్లో పంటలు పండించుకుంటామనుకున్న సంతోషం లేకుండా పోయిందని ఆ దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల్లోకి పోనివ్వకుండా హరీశ్‌రెడ్డి అడ్డుకుంటుండటంతో ఏడేళ్ల్లుగా భూములు పడావుబడి ఉన్నాయని అధికారుల చుట్టూ తిరిగినా దారి ఇవ్వడంలేదని వాపోయారు.
భూములకు వెళ్లకుంట దౌర్జన్యం చేస్తున్నరు
మాకు సర్కార్ భూమి కొనిచ్చినా లాభం లేకుండా పోయింది. ఇచ్చిన రెండెకరాల్లో బోరు వేయలేదు. కరెంటు ఇయ్యలేదు. మేమైనా అప్పుచేసి భూమి దున్నుకుందామనుకుంటే పక్క భూమి పటేల్ భూమిలకు పోనిత్తలేడు. వానకాలం విత్తనాలన్న వేసుకుందమనిపోతే దౌర్జన్యం చేసిండు. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటికైనా మాకు తొవ్వజూపించాలె.
లింగాల పరుశురాములు, బాధిత రైతు
పొలానికి తోవ ఇస్తలేడు
మా తాతముత్తాతల నుంచి నాకు వారసత్వంగా పన్నెండెకరాల వ్యవసాయం భూమి వచ్చింది. మా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు. ఐదేండ్ల నుంచి హరీశ్‌రెడ్డి నన్ను వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. తన భూమిలో నుంచి వెళ్లవద్దని, తొవ్వ లేదని నా వ్యవసాయాన్ని బం దుపెట్టిండు. కుటుంబ పోషణ భారంగా మారింది. ఉన్నతాధికారులు న్యాయం చేయాలి.
ఎడమల రాజిరెడ్డి, బాధిత రైతు