28-04-2025 06:39:31 PM
జింక్ చెప్పులతో.. స్తంభం ఎక్కొచ్చు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇంతకుముందు విద్యుత్ స్తంభాలు ఎక్కాలంటే సిబ్బంది యాతన పడాల్సి వచ్చేది. ఇక ఎండాకాలంలో అయితే సిమెంటు స్తంభాలు వేడెక్కి సిబ్బందికి కాళ్లు చేతులు బొబ్బలెక్కేవి. వర్షాకాలంలో అయితే స్తంభాలు ఎక్కుతుండగా జారిపడి ప్రమాదాల బారిన పడేవారు. అయితే కొందరు ఇనుప చువ్వలతో విద్యుత్ స్తంభాన్ని ఎక్కి దిగడానికి పాదరక్షలను తయారు చేసుకున్నారు. అయితే అవి అంత సురక్షితమైనవి కాకపోవడంతో వినియోగానికి పెద్దగా ఉపయోగపడలేదు.
ఈ క్రమంలో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఒకరు విద్యుత్ స్తంభాలు ఎక్కి దిగడానికి ఏలాంటి ఇబ్బంది కలగకుండా, ఇరుపచువ్వలతో కాకుండా జింక్ రాడ్లతో ప్రత్యేకంగా పాదరక్షలను రూపొందించారు. పూర్తిగా ఆధునిక పద్ధతిలో ప్రస్తుత విద్యుత్ స్తంభాలను సులువుగా ఎక్కి దిగడానికి అనువుగా అవసరమైన రక్షణ ఏర్పాట్లను కూడా రూపొందించారు. జింక్ ప్లేట్ పై ప్రత్యేకమైన రబ్బరు చెప్పులు అమర్చడంతో పాటు కాలు పట్టు తప్పి జారకుండా బెల్ట్ కూడా ఏర్పాటు చేశారు. 2,200 రూపాయలు ఆన్లైన్ ద్వారా తెలిస్తే కార్గో ద్వారా మరుసటిరోజే డెలివరీ ఇస్తున్నారు.