calender_icon.png 18 October, 2024 | 5:17 AM

నాసిరకం చీరలిచ్చి కించపరిచింది మీరే

18-10-2024 02:56:40 AM

  1. చీరలకు మించిన ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తున్నాం
  2. మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో బ తుకమ్మ చీరలను నిలిపేశారని మా జీమంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క ఖండించారు. నాసిరకం చీరలిచ్చి మహిళల ఆత్మగౌవరాన్ని బీఆర్‌ఎస్ పార్టీయే కించపరిచిందని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బతుకమ్మ చీరలకు మించిన ఆర్థిక ప్రయోజనాలను మా ప్రభుత్వంలో మహిళలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏటా రూ.300 కోట్లతో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తే.. మేము సగటున నెలకు రూ.332 కోట్ల ఖర్చుతో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నామని తెలిపారు.

మీ హయాంలో రూ.1,200 ఉన్న గ్యాస్‌ను మహిళల వంటింటి భారం తగ్గించేందుకు రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం కింద వెయ్యి కోట్లు వెచ్చించామని వెల్లడించారు. మహిళ సంఘాల ఆర్థిక స్వావలంబన కోసం బ్యాంకులకు రూ.400 కోట్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందని స్పష్టం చేశారు.

మహిళల గౌరవాన్ని నిలబెడుతూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో వెయ్యి కోట్లు చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిల్లాకేంద్రాల్లో మహిళా పారిశ్రామికవాడలు, మహిళా సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి అనేక హామీలను నెరవేర్చేందుకు మీకు తొమ్మిందిన్నరేండ్లు సరిపోలేదా అని ఎద్దేవా చేశారు. కానీ ఏడాదిలోనే మా ప్రభుత్వం అన్ని చేయాలని మీరు ఆశించడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని స్పష్టం చేశారు.

అభయహస్తం కింద మహిళలు దాచుకున్న పొదుపు సొమ్ము రూ.500 కోట్లు కొల్లగొట్టిన మీరు ఇప్పుడు వారి సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మీ హయాంలో మహిళలపై లక్షన్నరకు పైగా నేరాలు, అఘాయిత్యాలు జరిగినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదించిందని, అలాంటిది మీరు మహిళల భద్రతపై సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.