తల్లిదండ్రుల నుంచే పిల్లలు స్ఫూర్తిని పొందుతారు. పేరెంట్స్ ప్రేరణతోనే చదువుల్లోకానీ, ఆటల్లోకానీ రాణిస్తారు. అందుకే పేరెంటింగ్ పిల్లల అభివృద్ధికి ప్రధానం. పిల్లలను ఎలా ఉత్తమంగా తీర్చిది ద్దాలి? నైపుణ్య విలువలను ఏవిధంగా నేర్పించాలి? అనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలని చెబుతున్నారు నిపుణులు
బలాలను గుర్తించండి
తల్లిదండ్రులుగా పిల్లల బలహీనతలను హైలైట్ చేయడం కంటే బలాన్ని గుర్తించాలి. ఇది పిల్లల వ్యక్తిగత నిర్మాణానికి దోహదపడుతుంది. పిల్లలను ఇష్టమైన రంగాల వైపు ప్రోత్సాహిస్తే అన్నింట్లోనూ పట్టు సాధించే అవకాశాలు ఎక్కువ. ఉదాహరణకు క్రికెట్, కబడ్డీ, క్యారమ్ లాంటి ఆటలు ఇష్టం ఉంటే నిరుత్సాహపర్చకుండా ప్రోత్సహించాలి. అప్పుడే పిల్లలకు తల్లిదండ్రు లపై నమ్మకం కలుగుతుంది.
ఇతరులతో పోల్చకండి
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అదే పనిగా పని చెబుతుంటారు. ఆ పనులు చేయకపోతే తిట్టడం, కొట్టడం, అరవడం చేస్తుంటారు. దాంతో పిల్లలు మొండిగా తయారవుతారు. కాబట్టి ఆప్యాయంగా దగ్గరకి పిలుచుకుని చెప్తే మాట వింటారు. అలాగే ఇతర పిల్లలతో పోల్చడం కూడా సరికాదు. ఇలా చేస్తే వాళ్లు మరింత బద్ధకస్తులవుతారు. అయితే మీ పిల్లల్లో ప్రత్యేక లక్షణాలను ఉంటే.. వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే అందులో రాణించడానికి అవకాశం ఉంటుంది.
లక్ష్యాలు రుద్దకండి
కొందరు తల్లిదండ్రుల వారి పిల్లలపై తమ లక్ష్యాలు, ఆశయాలను బలవంతంగా రుద్దుతుంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే చిన్నారులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. ఫలితంగా పిల్లలు చేయాల్సిన పను లు చేయలేకపోతుంటారు. ఇక ఒత్తిడి కారణంగా క్రియేటివిటీ పోతుంది. కాబట్టి మొదటగా వారిలో పాజి టివిటీ పెంచాలి. వారు చదువులోకానీ, ఆటల్లోకానీ వారికి కావాల్సిన ప్రేరణను అందించాలి. తద్వారా పిల్లలో ‘ఏదైనా సాధించగలం’ అనే పాజిటివిటీ పెరుగుతుంది. ఇది పిల్లల జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు దోహదపడుతుంది.
ఇతరులకు సాయం చేసేలా..
పిల్లలకు చిన్నప్పట్నుంచే సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుంచి వారిలో స్వార్ధాన్ని నూరిపోయకూడదు. అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణంలో పెరిగేలా అలవాటు చేయాలి. తద్వారా ఒంటరిగా ఉన్నామనే భావనను కోల్పోయి ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు ఇతరులకు సహాయపడే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. దాంతో ఇతరులకు సహాయపడాలనే తపన అలవడుతుంది. అంతేకాదు.. నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి.
చిన్న చిన్న బాధ్యతలు
పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా చదువుకోవాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. ఎంత చదివితే అంత ప్రయోజనం అని భావిస్తాం. అయితే పిల్లలకు చదువుతోపాటు ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలను కూడా అప్పజెప్పాలి. దీనివల్ల వారిలో కృషి, పట్టుదల పెరుగుతుంది. రోజూ మన ఇంటిలో ఉండే కొన్ని బాధ్యతలను వారు క్రమం తప్పకుండా నిర్వర్తించేలా వారిని ప్రేరేపించాలి.
కలిసి చదవడం
ప్రతిరోజూ కలిసి పుస్తకాలు చదవండి. ఈ అలవాటు చిన్నవయసులోనే అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు మాటల కంటే చదవడానికే మొగ్గుచూపుతుంటారు. పిల్లలతో కలిసి చదవడం వల్ల రీడింగ్ ఒక అలవాటుగా మారి అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని షెడ్యూల్ చేయండి. రోజులో 10 లేదా 15 నిమిషాలపాటు వారితో కలిసి చదివేలా ప్లాన్ చేసుకోండి. తల్లిదండ్రులుగా మీ ప్రేమను చూపించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదనే విషయాన్ని గుర్తించుకోవాలి.