calender_icon.png 23 October, 2024 | 3:57 AM

మీరు సన్నాసా.. రాహుల్ సన్నాసా!

15-07-2024 01:36:39 AM

  • నిరుద్యోగులను అవమానించారు

సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి 

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకుని యువతకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు డిమాండ్ చేశారు.  నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్ధాయి దిగజారి, అత్యంత దివాళకోరు తనంగా మాట్లాడారని ఆది వారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోసం మోతీలాల్ నాయక్ పోరాటం చేస్తే అవమానించేలా మాట్లాడారని, ఆశోక్‌నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగం సంపాదించుకున్న రేవంత్‌రెడ్డి అదే కోచింగ్ సెంటర్లకు వెళుతున్న యువతను అవమానించారని మండిపడ్డారు.

దీంతో యువత ఆయన తీరుపై భగ్గుమంటూ ఆందోళన చేపట్టారని, కాంగ్రెస్‌ను గద్దెనెక్కించిన యువత నేడు ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. 8 నెలల్లో ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వం, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తారో సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు వదిలిపెట్టమని, ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామని హెచ్చరించారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, లక్షలామంది యువతకు సంబంధించిన అంశమన్నారు. ఈ అంశంలో రేవంత్‌రెడ్డి  ఈగోకు, బేషజా లకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని, కండకావరంతో మాట్లాడటం మానుకోవాలని హితువు పలికారు.

రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు రేవంత్, రాహుల్ గాంధీలేనని, గతంలో ఏ పరీక్ష రాస్తున్నారని రాహుల్, రేవంత్ నిరుద్యోగులతో దీక్ష  చేయించారో చెప్పాలన్నారు. అశోక్‌నగర్‌లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్‌రెడ్డి మీరు సన్నాసులా, రాహుల్ సన్నాసా అనే విషయం యువతకు చెప్పాలని, ముఖ్యమంత్రి అన్న సంగతి మరిచి ప్రతిపక్షంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడని, సీఎం అనే విషయం గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదని సూచించారు.  నిరు ద్యోగులు అడుగుతున్న డిమాండ్లకు వెంటనే సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని, గ్రూప్- మెయిన్స్‌కు 1ః100 పద్ధ్దతిలో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నేరవేర్చాలన్నారు.

నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దివాళకోరు తనంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతామని, ఉద్యోగాలకు సంబంధించిన శ్వేతపత్రం ప్రచురించాలని డిమాండ్ చేస్తామని, ఒప్పుకోకపోతే వాయిదా తీర్మానం ఇచ్చినా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనకాడమని స్పష్టం చేశారు. నిరుద్యోగుల కోసం బక్క జాడన్స్ దీక్ష  చేస్తుంటే ఏ ఉద్యోగం కోసం దీక్ష చేస్తున్నారని రేవంత్‌రెడ్డి  ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. 2023లో గాంధీభవన్‌లో రేవంత్ కూడా దీక్ష చేశారని, ఏ ఉద్యోగం కోసం దీక్ష చేశాడో సమాధానం చెప్పాలన్నారు.