calender_icon.png 22 October, 2024 | 11:37 PM

మీరు మా రాజు కాదు

22-10-2024 03:07:43 AM

  1. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో కింగ్ చార్లెస్‌కు అవమానం
  2. మా భూమి, సొమ్ము మాకు తిరిగి ఇచ్చేయండి
  3. స్థానిక ఆదివాసీ సెనేటర్ లిడియా థోర్ప్

కాన్‌బెర్రా, అక్టోబర్ 2౧: బ్రిటన్ రాజు చార్లెస్ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఘోర అవమానం జరిగింది. ఆస్ట్రేలియాకు సైతం అధినేతగా కొనసాగుతున్న బ్రిటన్ రాజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభను ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు.

చార్లెస్ ప్రసంగం పూర్తయిన వెంటనే రాచరికానికి వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ సెనేటర్ లిడియా థోర్ప్ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మా ప్రాంతాన్ని మాకు వెనక్కి ఇచ్చేయండి. మీరు మా నుంచి దోచుకున్నదంతా తిరిగి ఇచ్చేయండి.

స్థానిక ప్రజలతో ఇక్కడి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలి. ఇది మీ దేశం కాదు. నువ్వు మా రాజు కాదు. ఐరోపా వలసదారులు స్థానిక ఆస్ట్రేలియన్లపై మారణహోమానికి పాల్పడ్డారు అంటూ పెద్దపెట్టున థోర్ప్ అరిచారు. నిమిషం పాటు సభలో కేకలు వేశారు. దీంతో ఆమెను సభ నుంచి ఎస్కార్ట్స్ బయటికి తీసుకెళ్లారు. 

వలసవాదంపై వ్యతిరేకత

థోర్ప్ మొదటి నుంచీ వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ఆదివాసులపై బ్రిటన్ చేసిన హత్యాకాండపై విరుచుకుపడేవారు. 2022లో థోర్ప్ ప్రమాణ స్వీకార సమయంలోనూ అప్పటి బ్రిటన్ రాణి ఎలిజబెత్ కూడా వలస రాజ్య పాలకురాలని అభివర్ణిస్తూ ప్రమాణం చేశారు. అప్పుడు సభా అధ్యక్షుడు సూ లిన్స్ ఆమెను సరిదిద్దారు.

అఫిడవిట్‌లో ఉన్నవి మాత్రమే చదవాలని సూచించారు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కింగ్ చార్లెస్, కెమిల్లా దంపతులకు నిరసనలు ఎదురువుతూనే ఉన్నాయి. చాలా కార్యక్రమాల్లో వలసవాదం నశించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

అయితే ఈ అంశంపై చార్లెస్ ఇంతవరకు స్పందించలేదు. పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఆస్ట్రేలియా మొదటి పౌరులు తనకు ఎంతో గౌరవిచ్చారని అన్నారు. వాళ్ల సంస్కృతిని ప్రశంసించారు. మొదటిసారి టీనేజీలో ఆస్ట్రేలియాకు వచ్చానని, ఈ ప్రాంతంతో తనకెంతో అనుభవం ఉందని తెలిపారు.    

అప్రకటిత స్వాతంత్య్రమే!

భారత్ తరహాలోనే ఆస్ట్రేలియా కూడా 100 ఏళ్ల పాటు వలస పాలనలో ఉంది. ఆస్ట్రేలియాలో బ్రిటన్ అడుగుపెట్టిన తర్వాత వేలాది మంది స్థానిక ఆదిమవాసులను చంపేశారు. 1901లో ఆస్ట్రేలియా అప్రకటిత స్వాతంత్య్రం పొందింది. అయినప్పటికీ భారత్ మాదిరి పూర్తి స్థాయి గణతంత్రం పొందలేదు. మనదేశంలో రాష్ట్రపతి హోదా ఆస్ట్రేలియా లో బ్రిటన్ రాజుకు ఉంటుంది.

1999 లో ఆస్ట్రేలియా రాణిగా ఎలిజబెత్ తప్పించాలని, పార్లమెంట్ ఎన్నుకున్నవారినే నియమించే అంశంపై ఓటింగ్ జరిగింది. కానీ స్వల్ప మెజార్టీతో ఈ ప్రతిపాదన వీగిపోయింది. అంతేకాకండా దేశంలో ఆదివాసీ ప్రాతినిధ్య అసెంబ్లీ ఏర్పాటును సైతం 2023లో పార్లమెంట్ భారీ మెజారిటీతో తిరస్కరించింది.