ప్రజలను మోసగించిన రేవంత్ సర్కార్
- కాంగ్రెస్ హామీల్లో 99శాతం ఇంకా మొదలే కాలేదు
- ఆ విషయం తెలిపేందుకు ముంబై వచ్చాను
- తెలంగాణలో అభివృద్ధి జరిగిందని భావిస్తే ముంబై ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్ధమా
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): తెలం గాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ర్ట ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను ఇక్కడి ప్రజలకు చెప్పారని అన్నారు.
ముంబైలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత ఎలా మోసం చేస్తోందో మహారాష్ర్ట ప్రజలకు వివరించేందుకు రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను. ఇచ్చిన హామీల్లో 99శాతం ఇంకా మొదలే కాలేదు.
రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జోడీ వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో అదే తరహాలో మహారాష్ర్ట ప్రజలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారు’ అని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వాలు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారాయని ఆయన ఆరోపించారు.
ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏటీఎంలా మార్చుకుని మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
మోసం చేసేందుకు కుట్ర...
‘రాహుల్, సోనియా, ప్రియాంక, రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో ఢంకా బజాయించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులెవరూ అప్పులు కట్టొద్దని వారిని రెచ్చగొట్టారు. మేనిఫెస్టోలో మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చి నెలకు రూ.2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు కూడా ఈ పథకం లబ్ధి అందలేదు.
రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15 వేల ఆర్థిక సహాయం, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయంకూడా ఏ ఒక్కరికీ చేరలేదు. వివిధ పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో.. ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేదు. మూసీ సుందరీకరణ పేరుతో దశాబ్దాలుగా ఉన్నవారిని ఇండ్లనుంచి బయటకు గెంటేసి..
ఆ ఇళ్లు కూల్చేస్తున్నారు. స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామన్నా.. ఇంతవరకు ఇవ్వలేదు. యువతకు రూ.5లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామన్నా ఉత్తిదే. మేనిఫెస్టోలో మొదటి పేజీలోని పథకాలే అమలుచేయలేని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. మహారాష్ర్ట ప్రజలను మోసం చేసేందుకు రావడం విడ్డూరం, హాస్యాస్పదం’ అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.
ముంబయి ప్రెస్ క్లబ్‌లో చర్చకు సిద్ధమా రాహుల్...
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే.. మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, కార్మికులు, డయాలసిస్ పేషెంట్లకు రూ.4వేల పింఛను ఇస్తామ న్నా నేటికీ ఇచ్చింది లేదన్నారు. గతంలో ఇచ్చే పింఛను కూడా ఇవ్వడంలేదన్నారు. పేపర్లలో భారీగా ప్రకటనలు ఇవ్వడమే తప్ప వాటిని అమలుచేసే శక్తి కాంగ్రెస్ నేతలకు లేదని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసి... ఇప్పుడు మహారాష్ర్ట ప్రజలను కూడా మోసం చేసేందుకు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని... తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని భావిస్తే రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నా.. ముంబై ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మహారాష్ర్ట ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను విశ్వసించరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ కంపెనీలకు రాష్ర్ట ప్రభుత్వం రూ. 81,500 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదని... అందుకే దాదాపు రూ.8లక్షల కోట్లు అప్పులతో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందన్నారు. పదేళ్లపాటు బీఆర్‌ఎస్ లూటీ చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని విమర్శించారు. మహారాష్ర్ట ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని ఆయన కోరారు.