స్పృహలో ఉండే సబ్‌స్టాన్షియల్ సర్టిఫికెట్ ఇచ్చారా?
- సీఈ సుధాకర్ రెడ్డిపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆగ్రహం
- 2 లక్షల ఎకరాల ఆయకట్టుకై రీడిజైన్ పేర అంచనాలను పెంచేశారన్న ఘోష్ కమిషన్
- వరద వేగాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయన్న సీఈ
- సీఈకి 81 ప్రశ్నలు సంధించిన కమిషన్
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రెండు లక్షల ఎకరాల ఆయకట్టు కోసం రీడిజైన్ పేరిట రూ.80వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.27లక్షల కోట్లకు పెంచడం నిజమేనా అని కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రామగుండం చీఫ్ ఇంజినీర్ కే సుధాకర్ రెడ్డిని ప్రశ్నించింది.
రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుకు అంత పెద్ద మొత్తం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం కరెక్టేనా అని ఆయన సీఈని ప్రశ్నించారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో జరిగిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణకు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. సుధాకర్ రెడ్డికి కమిషన్ ఏకంగా 81 ప్రశ్నలను సంధించింది.
ఆయన చాలా ప్రశ్నలకు తెలియదని, అప్పుడు తాను లేనని సమాధానం ఇచ్చారు. రెండు లక్షల ఎకరాలకు అయితే అంత బడ్జెట్ అవసరం లేదని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ ద్వారా 18.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచినట్లు తెలిపారు. ఇక అప్పటికే మనుగడలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన 18.25 లక్షల ఎకరాలను స్థిరీక రించేందుకు కూడా నిర్ణయించినట్లు తెలిపా రు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన డబ్బంతా వృథానే అని భావిస్తున్నారా అంటూ కమిషన్ ప్రశ్నించగా... దాదాపుగా అదేనంటూ సీఈ పేర్కొన్నారు. అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారా అని కమిషన్ ప్రశ్నించగా... వ్యా స్కోప్ ఇచ్చిన డీపీఆర్ ప్రకారంగా పనులు చేపట్టినట్లు సీఈ తెలిపారు.
వ్యాస్కోప్‌ను డీపీఆర్ ఇవ్వమని అడిగిందెవరన్న ప్రశ్నకు ప్రభుత్వమని సమాధానమిచ్చారు. ప్రభు త్వం అంటే ఎవరో స్పష్టంగా చెప్పాలని ప్రశి ్నంచగా, అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అని తెలిపారు. మంత్రితోపాటు ఇరిగేషన్ శాఖకు చెందిన అధికా రులెవరున్నారని అడగ్గా తనకు తెలియదని సీఈ చెప్పారు.
అప్పటికే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం నిధులు ఖర్చు చేశామని, మేడిగడ్డ నిర్మాణం అంత లాభదాయకం కాదని.. సీనియర్ రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు కదా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు నిజమేనని సీఈ సమాధానం చెప్పారు. అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయని...
మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లు లు ఇంకా సబ్మిట్ చేయలేదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు నీటిని నిల్వ చేయవచ్చని సీఈ తెలిపారు. చేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి చెల్లిస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా అని కమిషన్ ప్రశ్నించగా అవునంటూ సమాధానమిచ్చారు.
వరద వేగాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే డ్యామేజీ..
డిజైన్లలో లోపాల వల్ల బరాజ్‌ల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా అన్న- కమిషన్ ప్రశ్నకు... మేడిగడ్డ బరాజ్‌లోని బ్లాక్‌లలో లెంత్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం, వరద వేగాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే డ్యామేజి జరిగిందని, బ్లాకులు దెబ్బతిన్నాయని తెలిపారు.
రబ్బర్ స్టాంప్ పనిచేశారా..?
మేడిగడ్డ సబ్ స్టాన్షియల్ సర్టిఫికెట్‌ను ఈఈ రమణారెడ్డి ఇచ్చారని తాను కౌంటర్ సైన్ చేసినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ పూర్తయినట్లుగా ఈఈ తిరుపతి రెడ్డి, ఎస్‌ఈ రమణారెడ్డి కౌంటర్ సైన్‌తో ఇచ్చారని అన్నారు. సబ్ స్టాన్షియల్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు పనులు పూర్తయ్యాయో లేదో తనిఖీ చేశారా, డాక్యుమెంట్లు పరిశీలించారా అని కమిషన్ ప్రశ్నించగా...
తాను డాక్యుమెంట్లు పరిశీలించకుండానే సబ్‌స్టాన్షియల్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సుధాకర్ రెడ్డి అంగీకరించారు. మీరు స్పృహలో ఉండే ఈ సర్టిఫి కెట్ జారీ చేశారా.. ఒక రబ్బర్ స్టాంప్‌లాగా పనిచేశారా అంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాఫర్ డ్యాం తొలగించడంలో ఏజెన్సీ నిర్లక్ష్యం
కాఫర్ డ్యాం తొలగించడంలో ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల నదీ ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి బరాజ్‌కు నష్టం వాటిల్లిందనే అంశం లో కొంత మేర నిజమేనని సీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. 2019లో జరిగిన వరద వల్ల ఏర్పడిన డ్యామేజీకి సంబంధించి మేడిగడ్డ లో మరమ్మతులు జరగలేదని, అన్నారంలో మాత్రం జరిగాయన్నారు.
ప్రాజెక్టు ఇంజినీర్ల తప్పిదాల వల్లనే ఏజెన్సీకి పనులను పూర్తి చేసేందుకు గడువు పెంచినట్లుగా సీఈ అంగీకరించారు. కాఫర్ డ్యాం నిర్మాణానికి అదన పు చెల్లింపులు ఎందుకు చేశారనగా.. వ్యా స్కోప్ తయారు చేసిన డీపీఆర్ బిడ్ డాక్యుమెంట్ తయారీలోనే ఉన్న క్లాజ్ మేరకు చెల్లించినట్లు తెలిపారు.
అయితే అదనపు చెల్లింపుల వల్ల సర్కారు ఖజానాకు నష్టమేర్పడిందని సీఈ ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన చెల్లింపులు చేయాలని అప్పటి సీఈ, మంత్రి హరీశ్‌రావు ఆదేశించారని అయితే ఆ చెల్లింపులు జరగలేదని సీఈ తెలిపారు.
కాఫర్ డ్యాం తొలగించేందుకు ఏజెన్సీకి రూ.61.21 కోట్లు అదనంగా ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనగా అప్పుడు తాను ఆ పనుల్లో లేనట్లుగా సీఈ పేర్కొన్నారు. పనులు త్వరగా పూర్తవుతాయనే ఉద్దేశంతో డయాఫ్రం వాల్ నిర్మాణం బదులుగా సీకెంట్ పైల్స్ వాడినట్లుగా తెలిపారు.
ఎవరి అనుమతితో నీటి నిల్వ చేశారు?
మేడిగడ్డలో ఎవరి అనుమతితో నీటిని నిల్వ చేశారన్న ప్రశ్నకు, సీఈ ఆదేశాల మేరకు అని సుధాకర్ రెడ్డి తెలి పారు. టీఎస్‌ఈఆర్‌ఎల్ సూచించిన గేట్స్ ఆపరేషన్ విధానాలను ఉల్లంఘిం చి గేట్లు ఓపెన్ చేయడం వల్లే ఆప్రాన్, సీసీ బ్లాక్స్‌కు నష్టం వాటిల్లిందా అంటే.. అన్నారంలో గేట్లను ఎత్తే క్రమంలో షూటింగ్ వెలాసిటీస్ ఏర్పడి ఆప్రాన్, సీసీ బ్లాక్స్‌కు నష్టం చేకూర్చిందన్నారు.
డ్రాయింగ్స్ ఆలస్యం వల్ల పనులు ఆలస్యమయ్యాయా అని కమిషన్ ప్రశ్నించ గా... నిజమేనని అయితే దీనిపై డ్రాయిం గ్స్ ఇచ్చిన సీడీఓకు మాత్రం లేఖ రాయలేదని అంగీకరించారు. మేడిగడ్డలో 16.17, అన్నారంలో 10.87, సుందిళ్లలో 8.83 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీలు అంతటి నీటి నిల్వను తట్టుకునేలా నిర్మించారా అనగా..
సీఈ సీడీఓ ఇచ్చిన డిజైన్స్ ఆధారంగా అయి తే నిల్వచేయవచ్చని తెలిపారు. 3 బరాజ్‌ల నిర్మాణంలో డిజైన్లను ఫైనలైజ్ చేసే సమయంలో ఏజెన్సీ పాత్ర ఉందా అన్న ప్రశ్నకు.. కటాఫ్స్ ఫైనలైజ్ చేసే సమయంలో ఏజెన్సీని సంప్రదించినట్లు సీఈ తెలిపారు.
కాళేశ్వరం కార్పొరేషన్ ఆలోచన హరీశ్‌రావుదే..
కాళేశ్వరం కార్పొరేషన్ (కేఐపీసీఎల్) ఏర్పాటు ఆలోచన మంత్రి హరీశ్‌రావుదేనని సీఈ తెలిపారు. నిధులు, ఆదాయం లేకుండానే దీన్ని రూపొందించినట్లు అం గీకరించారు. 3 బరాజ్‌ల అంచనాలను ప్రభుత్వానికి పంపించామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి ఈ అంచనాలను ఆమోదించారని అన్నారు. అంచనాలను రెండు దశల్లో రివైజ్ చేసినట్లు తెలిపారు. 49.61 శాతం మేర అంచనాలను డీ వాటరింగ్ కోసం పెంచారా అన్న ప్రశ్నకు నిబంధనల మేరకు చేసినట్లు తెలిపారు.
కోల్ బెడ్స్ ఉన్నట్లు తెలుసా..
మేడిగడ్డ బరాజ్ నిర్మాణం జరిగిన చోట కోల్ బెడ్స్ ఉన్నట్లు తెలుసా అన్న ప్రశ్నకు.. తెలియదని సీఈ సమాధానమిచ్చారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ, సర్దీ ప్ కన్సల్టింగ్ ఏజెన్సీ మేడిగడ్డ బరాజ్ వద్ద బోర్ హోల్స్ వేసి కోల్ బెడ్స్ ఉన్నట్లుగా నివేదిక ఇచ్చింది కదా ఆ నివేదికను చూశారా అంటూ తిరిగి పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. నివేదికను చూశానని అయితే అక్కడ వేసిన బోర్ హోల్స్‌లో కేవలం ఒక్కదానిలో మాత్రమే కొంత మేర కోల్ బెడ్స్ ఉన్నట్లు గుర్తించామని సీఈ తెలిపారు.