భారత అథ్లెట్ల బృందంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది భారత అథ్లెట్ల బృందాన్ని బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండప్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము.. అథ్లెట్ల బృందంతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ముర్ము పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆరు పతకాలే వచ్చినప్పటికీ తృటిలో మన అథ్లెట్లు మెడల్స్ కోల్పోవడం బాధాకరం.
ఈ ప్రదర్శన దేశ ఖ్యాతిని పెంచింది’ అని పేర్కొన్నారు. కాగా పతకాలు సాధించిన షూటర్లు మనూ బాకర్, స్వప్నిల్ కుసాలే, సరబ్ జోత్ సింగ్, భారత హాకీ జట్టు, రెజ్లర్ అమన్ షెరావత్‌లతో రాష్ట్రపతి ప్రత్యేకంగా ముచ్చటించారు. జావెలిన్ త్రోలో రజతం సాధించిన నీరజ్ చోప్రా జర్మనీలో ఉండడంతో ఈ కార్యక్రమానికి దూరమయ్యాడు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని నేడు ప్రధాని నరేంద్ర మోదీ భారత అథ్లెట్ల బృందాన్ని కలుసుకోనున్న సంగతి తెలిసిందే.