యోగా చాలా తేలికైంది. ఆసనాలు ఒకసారి నేర్చుకుంటే చాలు. ఎవరికివారే చేసుకోవచ్చు. ఎలాంటి ఉపకరణాలూ అవసరం లేదు. పెద్దగా సమయం కూడా పట్టదు. క్రమంగా సాధన చేస్తే జీవితాంతం తోడుగా నిలుస్తుంది. యోగాను ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయొచ్చు. అయితే కొన్ని పద్ధతులు పాటించడం మంచిది.
* యోగాసనాలను ఉదయం పూట.. అదీ పరిగడుపున చేయడం మంచిది. ఒకవేళ భోజనం చేస్తే 4-5 గంటల తర్వాత టిఫిన్ తీసుకుంటే రెండు నుంచి మూడు గంటల అనంతరం చేయాలి.
* యోగాసనాలు వేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించాలి. పాదాలకు చెప్పులు, బూట్ల వంటివి వేసుకోవద్దు.
* గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో.. లేదా కిటికీలు, తలుపులు తెరచి వెలుతురు బాగా వస్తున్న గదుల్లో యోగా చేయాలి.
* ఉదయం సూర్యుడి కిరణాలు పడే ప్రాంతంలో యోగా చేయడం ఎంతో మేలు.
* చాప, దుప్పటి, శుభ్రమైన వస్త్రం.. ఏదైనా పర చి దాని మీద కూచొని ఆసనాలు వేయాలి. నేల, గచ్చు, బండల మీద వేయకూడదు.
* యోగా చేస్తున్నప్పుడు మధ్యలో మల, మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే బలవంతాన ఆపుకోకూడదు. విసర్జన అనంతరం తిరిగి కొనసాగిం చాలి. దాహం వేస్తే కొద్దిగా నీళ్లు తాగొచ్చు.
* యోగాసనాలను నెమ్మదిగా, అలసట లేకుండా సాపీగా చేయడం చాలా ముఖ్యం.
* యోగా చేయడం ముగిశాక తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి.