22-04-2025 12:00:00 AM
జగిత్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నాడు రేషన్ బియ్యం అంటే నైరాశ్యంగా ముఖం చిట్లించుకున్న లబ్ధిదారులు నేడు అవి తమకే కావాలని సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపుల్లో సరఫరా చేసిన దొడ్డు బియ్యం వద్దని అప్పుడు అమ్ముకున్న వారే, ఇప్పుడు క్యూ కట్టి మరీ తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈనెల రేషన్ షాపుల బియ్యం కోటా అన్ని చోట్ల దాదాపు 100 శాతం పంపిణీ జరిగింది.
గతంలో ముక్కిన, మెరిగెలు, రాళ్లతో నిండిన నాసిరకం దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి. ప్రస్తుతం వాటి స్థానంలో నాణ్యమైన ’సన్న బియ్యం’ పంపిణీ ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడ లేనివిధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంతో నిరుపేదల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలో భాగంగా ఈ ఏప్రిల్ నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల్లో రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేపట్టింది. జగిత్యాల జిల్లాలో మొత్తం 3 లక్షల 7 వేల 97 రేషన్ కార్డున్నాయి. ఈ కార్డులపై సదరు లబ్ధిదారులకు వారి కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.
ఈ క్రమంలో జిల్లాకు 5 వేల 6 వందల 71 టన్నుల సన్న రకం బియ్యం కోటా మంజూరవగా, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని రేషన్ షాపుల్లోనూ దాదాపుగా పూర్తిస్థాయి బియ్యం పంపిణీ ముగిసింది. గతంలో రేషన్ షాపుల్లో పంపిణీ చేసే దొడ్డు బియ్యం నాసిరకంగా ఉండడంతో చాలా మంది లబ్ధిదారులు ఆ బియ్యాన్ని తాము తినకుండా అమ్ముకునే వారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో రేషన్లో లభిస్తున్న సన్న బియ్యంతో నిరుపేద కుటుంబాలు కడుపు నిండా ఆనందంగా భోజనం చేస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, సన్న బియ్యం పంపిణీతో పేదల మనోభావాలు ఆనందపడ్డాయి.
రేవంతన్న బియ్యం
రేషన్ దుకాణాల్లో తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. ఈ ’రేవంతన్న’ బియ్యం రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఉపయోగపడుతున్నాయి. అన్నం కూడా చాలా బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తిండి విషయంలో గరీబులను గొప్పోళ్లను చేసింది.
మచ్చ కవిత, కోరుట్ల. సంబురంగా ఉంది
రేవంతన్న ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇవ్వడం సంబురంగా ఉంది. గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం నాసిరకంగా ఉండడంతో తినడానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడిచ్చిన సన్న బియ్యం మంచిగున్నాయి. మాలాంటి గరీబోళ్లకు సన్న బియ్యం తిండి దొరకడం మా అదృష్టం.
దూస రాజవ్వ, జగిత్యాల.