calender_icon.png 5 February, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణకు సై.. కులసర్వేకు నై

05-02-2025 01:42:28 AM

ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు

  1. కులసర్వేలో బీసీలను తగ్గించిచూపారన్న కేటీఆర్ 
  2. ప్రభుత్వం కుట్ర చేసిందని నిరసిస్తూ బీఆర్‌ఎస్ వాకౌట్
  3. మండిపడ్డ మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్

హైదరాబాద్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. వర్గీకరణ కోసం ప్రభుత్వం చేసే ప్రతీ ప్రయత్నానికి అండగా ఉంటామన్నారు. మంగళవారం ఎస్సీ వర్గీకరణ నివేదికపై అసెంబ్లీలో జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ వర్గీకరణ కోసం పోరాడితే తామేదో అడ్డుకున్నట్లు రేవంత్‌రెడ్డి చిత్రీకరించడం సరికాదన్నారు. వర్గీకరణ కోసం గాంధీభవన్ వద్ద అమరులైన ఉద్యమకారులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2014,  నవంబర్ 29న  వర్గీకరణ కోసం  అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెప్పారు.

ఆ తీర్మానం కాపీలను ప్రధాని మోదీని కలిసి స్వయంగా కేసీఆర్ అందజేసినట్లు వివరించారు. వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో దేశంలోని ప్రముఖ న్యాయనిపుణులతో కేసును వాదించేలా చేసినట్లు పేర్కొన్నారు. జస్టిస్ షమీం అక్తర్ నివేదిక.. సామాజికంగా ఆర్థికంగా, విద్యాపరంగా అవకాశాలు ఉండాలని చెప్పిందన్నారు.

తమ సర్కారు అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాల్లో దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేసే ప్రయత్నం చేసినట్లు కేటీఆర్ వివరించారు. కమిషన్ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల మేరకు రూ.12 లక్షల దళిత బంధును ఇవ్వాలన్నారు. రానున్న రాష్ర్ట బడ్జెట్లో ఇందుకు భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

బీసీలను ఐదు శాతం తగ్గించారు.. 

అలాగే, బలహీన వర్గాలకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి వారి గొంతు కోసిన ప్రభుత్వ కుట్రను నిరసిస్తున్నామన్నారు. ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించిన తీరుపై రాష్ర్టంలోని బలహీన వర్గాలందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌కు పేరొస్తుందని బయటకెళ్లారు: మంత్రి శ్రీధర్‌బాబు

సమాజంలో అసమానతలను తగ్గించి నవ సమాజ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని కేటీఆర్ బయటకు వెళ్లారన్నారు. కేటీఆర్‌కు ఏం మాట్లాడాలో తెలియకే, ఎన్నికల మ్యానిఫోస్టోలోని అంశాలను మాట్లా డారని చెప్పారు.

దళితులకు సంబంధించి రాబోయే రోజుల్లో ఆర్థిక, రాజకీయ పరంగా ఎలాంటి అవకాశాలు ఇవ్వాలన్న దానిపై కేటీఆర్ సూచనలు ఇస్తారనుకుంటే, ఏం చెప్పకుండా ఆయన బయటకు వెళ్లారన్నారు. వారికి ప్రజలే జవాబు చెప్తారని మండిపడ్డారు. 

పదేళ్లలో బీఆర్‌ఎస్ బీసీలకు ఏం చేయలేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ బీసీలకు చేసిందేమీ లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. బీఆర్‌ఎస్ చేసిన సర్వేలో బీసీలు 51శాతం ఉన్నారని, తాము చేసిన సర్వేలో 56.33శాతం ఉన్నట్లు చెప్పారు. అలాగే, ఎస్టీ జనాభా కూడా ఇప్పుడు పెరిగిందన్నారు. ఓసీ పాపులేషన్ తగ్గిందన్నారు. బీసీలకు న్యాయం చేయడానికే ఈ సర్వే చేపట్టామన్నారు.