calender_icon.png 22 September, 2024 | 2:56 PM

ఏచూరి మరణం దేశానికి తీరని లోటు

22-09-2024 12:00:00 AM

  1. ఆయనతో మాట్లాడితే జైపాల్ రెడ్డి గుర్తుకొచ్చేవారు
  2. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపై తీసుకొచ్చారు
  3. సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): దేశ రాజకీయాల్లో ఏచూరి సీతారాం లేని లోటును భర్తీ చేయడం అసాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో ఆధిపత్యం చెలాయించాలని బీజేపీ కుట్రలు పన్నుతున్న ఈ కీలక సమయంలో ఏచూరి లేకపోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి, పేదల పక్షాన గళంవిప్పిన నేత సీతారాం అని అన్నారు.

శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర సీపీఎం పార్టీ ఆధ్వర్యం లో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి, ఆయన పేరుతో ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్ర పంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని.. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గుర్తుకొచ్చేవారన్నారు. కేరళలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు పరస్పర విమర్శలు చేసుకున్నా.. దేశాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు ఐక్యంగా ఉండేవారని, దీనికి ఏచూరి తీసుకున్న చొరవే కారణమన్నారు.

బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. దేశ రాజకీ యాల్లో తెలుగు వారి ప్రాధాన్యత రోజురోజుకూ తగ్గుతుందన్నారు. దేశ రాజకీయా ల్లో జైపాల్‌రెడ్డి సమకాలికుడని, నమ్మిన సిద్ధాతం కోసం చివరి శ్వాస వరకు నిలబడిన నాయకుడన్నారు. యూపీఏ పాలనలో పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు ఇవ్వడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఏచూరిని మార్గనిర్దేశకుడిగా భావిస్తారన్నారు.

విద్యార్థి దశ నుంచి దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారని, ఆయన స్ఫూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి విమర్శలు చేస్తే ప్రధాని మోదీ స్పందించకపోవడం వారి ఫాసిస్ట్ విధానాలకు నిదర్శమ న్నారు. కార్యక్రమంలో బీవీ రాఘవులు, ఎంపీ మల్లు రవి, మాజీ సీఎస్ మెహన్‌కందా, తమ్మినేని వీరభద్రం, పోటు రంగారావు హాజరయ్యారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడారు: కోదండరాం 

ప్రజాస్వామ్య విలువలను కాపాడే క్రమంలో అన్నీ పార్టీలను ఏకం చేయడంలో సీతారాం ఏచూరి చేసిన కృషి మరువలేనిదని టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. తాను జేఎన్‌యూలో చదువుకున్నరోజుల్లో ఏచూరితో పరిచయం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు. ఏచూరి జేఎన్‌యూకు మూడుసార్లు అధ్యక్షులుగా పనిచేశారని, తన కాలంలో బలమైన విద్యార్థి ఉద్యమాలను నడిపారన్నారు. 

యువ రాజకీయ నేతలకు ఆదర్శం: కేటీఆర్

ఉన్నత కుటుంబంలో పుట్టి పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువతరం ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మాది రక్త సంబంధమన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం మరింత ప్రమాదకరమన్నారు. రాజ్యాంగం అపహాస్యం అయినప్పుడల్లా తాము పాలకులను ప్రశిస్తున్నామన్నారు. తిట్లు, రోత మాటలతో రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి హుందాతనం భవిష్యత్ నాయకులకు ఒక పాఠం అని చెప్పకతప్పదన్నారు. పదవులతోనే కీర్తీ, ప్రతిష్ఠలు వస్తాయనుకుంటున్న ఈ రోజుల్లో.. ఎలాంటి పదవికీ ఆశపడకుండా ఏచూరి ప్రజల గుండెల్లో స్థానం సాధించుకున్నారన్నారు.

వామపక్షాలకు తీరని వేదన: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని 

పేదల సమస్యలపై రాజీలేని పోరాటం చేసి, వారి గుండెల్లో నిలిచిన సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ సభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. విద్యార్థి ఉద్యమాల నుంచే పోరుబాట పట్టి అనేక సమస్యలను పరిష్కరించారన్నారు. ప్రభుత్వం కుట్రలతో తీసుకొచ్చే విధానాలను వెంటనే పసిగట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి మార్పులు చేయించేవారని పేర్కొన్నారు.