calender_icon.png 22 December, 2024 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏచూరి ఇకలేరు

13-09-2024 12:58:58 AM

అల్విదా కామ్రేడ్!

  • 1952-2024
  • ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఊపిరితిత్తుల సమస్యతో తుదిశ్వాస
  • రాజకీయాలపై తనదైన ముద్ర 
  • ప్రముఖుల సంతాపం

కమ్యూనిస్టు దిగ్గజం, వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్టుగా, రచయితగా, ప్రముఖ రాజకీయవేత్తగా తనదైన ముద్రవేశారు ఏచూరి. మద్రాస్‌లో తెలుగు కుటుంబంలో పుట్టిన ఏచూరి హైదరాబాద్‌లోనే తన బాల్యాన్ని గడిపారు. ఢిల్లీ జేఎన్‌యూలో పీజీ చేస్తూ విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఆ సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీనే ఎదిరించిన సీతారాం.. సీపీఎంలో చేరి ఆ పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. 1992 నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.

2005 మధ్య రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. సీతారాం ఏచూరి మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వామపక్షాలకు సీతారాం దారిదీపమని, రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఏచూరికి మాత్రమే ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ఏచూరి తనకు ఎంతో మంచి మిత్రుడని, ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చలను మిస్ అవుతానని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ గుర్తుచేసుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమం, ప్రజాపోరాటంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని పలువురు నేతలు పేర్కొన్నారు.                               

  1. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో సీపీఎం అగ్రనేత మృతి
  2. పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు
  3. రచయితగానూ తనదైన ముద్ర

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రముఖ రాజకీయ నాయకుడు, వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (73) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్పెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆగస్టు 19 నుంచి చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో ఏచూరి గురువారం తుదిశ్వాస విడిచారు. సామాజిక కార్యకర్తగా, ఆర్థిక వేత్తగా, కాలమిస్టుగా ఏచూరి అనేక అంశాల్లో తన ముద్ర వేశారు. 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.  

ఆలిండియా ర్యాంకర్

మద్రాస్‌లో 1952 ఆగస్టు 12న ఏచూరి జన్మించారు. వాళ్లది తెలుగు కుటుంబం. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం, విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే గడిచింది. హైదరాబాద్‌లో ఆల్‌సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలో ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు.

1970లో సీబీఎస్‌ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా ఏచూరి నిలిచారు. ప్రముఖ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తిచేశారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎంఏ పట్టా పొందారు. అక్కడే పీహెచ్‌డీలో చేరినా ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. 

జేఎన్‌యూను వామపక్ష కోటగా మార్చి

1974లో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేతగా సీతారాం రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పటినుంచి నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏడాది జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడే సీపీఎం పార్టీలో చేరారు. అత్యవసర పరిస్థితి సమయంలో అరెస్టయ్యారు. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్‌కు 3 సార్లు ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారాత్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్ష కోటగా మార్చారు.

ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరగా, 1992లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్ని కయ్యారు. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో వైజాగ్‌లో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీకి ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు అదే పదవిలో ఏచూరి కొనసాగుతున్నారు. 

యూపీఏ ప్రభుత్వ నిర్మాణంలో కీలకంగా

ఎగువ సభలో అనేక అంశాలపై ప్రజల తరఫున గళం విప్పుతూ సీతారాం ఏచూరి మంచి గుర్తింపు సాధించారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ డ్రాఫ్ట్ రూపకల్పనలో మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంతో కలిసి కీలకంగా వ్యవహరించారు. 2004 యూపీఏ ప్రభుత్వ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. ఏచూరికి రచయితగానూ మంచి గుర్తింపు ఉంది. క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోదీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం పుస్తకాలు పుస్తకాలు రాశారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు. 

పార్టీలకతీతంగా స్నేహం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త విని దిగ్భ్రాంతి కలిగించింది. విద్యార్థి నేత నుంచి జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కీర్తి గడించారు. పార్టీకలకు అతీతంగా ఆయన స్నేహపూర్వకంగా ఉండేవారు. ఆయన కుటుంబసభ్యులు, సహచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. 

 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అందరితో కలిసిపోయేవారు

సీతారాం ఏచూరి మరణం ఎంతో బాధించింది. ఆయన వామపక్షాలకు దిక్సూచిలా పనిచేశారు. రాజకీయ నేతలందరితో మంచి  అనుబంధం ఉంది. సమర్థమైన పార్లమెంటేరియన్‌గా తనదైన ముద్ర వేశారు.                                ప్రధాని మోదీ

నిబద్ధతతో పనిచేశారు..

ప్రముఖ నేత సీతారాం ఏచూరి మృతి విషయం తెలిసి చాలా బాధపడ్డా. 5 దశాబ్దాల పాటు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారు. ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధతతో పనిచేశారు. ఇందులో ఆయనది గొప్ప లెగసీ.                   

ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్

దిగ్భ్రాంతి చెందా..

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సీతారాం ఏచూరి మరణ వార్త విని దిగ్భ్రాంతి చెందాను. రాజకీయాల్లో ఆయన లేమి తీరని లోటు. ఆయన కుటుంబం, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి కష్ట సమయంలో ఆయన కుటుంబం బలంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను.  

 కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

దేశంపై ఎంతో అవగాహన 

ఏచూరి దేశ ఆలోచనలకు రక్షకుడు. భారత్ గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. ఏచూరితో కలిసి చేసిన ఎన్నో సుదీర్ఘ చర్చలను మిస్ అవుతున్నా. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

 ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ

 మరణం బాధించింది..

ఏచూరి హఠాన్మరణం ఎంతో బాధించింది. ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో మంచి పార్లమెంటేరియన్‌గా, ప్రత్యేక జ్ఞానానికి చిహ్నంగా పనిచేశారు. ఏచూరి నాకు మంచి స్నేహితుడు. ఆయనతో ఎన్నో సార్లు వ్యక్తిగతంగా చర్చించాను. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు సంతాపం తెలియజేస్తున్నా. 

  కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

వీడ్కోలు కామ్రేడ్

కామ్రేడ్ సీతారాం ఏచూరి.. మీకు వీడ్కోలు. కమ్యూనిస్టు ఉద్యమం, ప్రజా పోరాటంలో ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయనతో గడిపిన క్షణాలు, పంచుకున్న భావాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని భారత్ కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం.   

బీ కేరళ సీఎం పినరయి విజయన్

తీరని లోటు

సీతారాం మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి మరణించారని తెలిసి బాధగా ఉంది. ప్రముఖ పార్లమెంటేరియన్ ఆయన. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నా.

 బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

నిరాడంబరుడు..

కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలియజేస్తున్నా. ఆయన మంచి రాజకీయ వేత్త. నిరా డంబరమైన రాజకీయ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. వ్యక్తిగత సమీకరణాలను సమతుల్యం చేస్తూనే రాజకీయ భావజాలాన్ని ప్రదర్శించగలరు. అద్భుతమైన పార్లమెంటేరియన్. అంతకుమించిన మేధావి. 

 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

వామపక్షాల్లో కీలక వ్యక్తి 

సీపీఎం పార్టీలో ఎంతో కీలకంగా పనిచేసిన సీతారాం ఏచూరి కన్నుమూశారు. దేశంలోని వామపక్ష పార్టీల్లో ఆయన కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన రెండుసార్లు వరుసగా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నిక య్యారంటే అందుకు కారణం ఆయన నిబద్ధతే. వామపక్ష భావజాలానికి ఆయన మరణం పూడ్చలేని లోటు. కార్మికులు, రైతుల గొంతుక.

 ఏన్సీపీ (ఎస్పీ)  చీఫ్ శరద్ పవార్

క్రియాశీలక నేత

వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి మరణం దిగ్భ్రాంతి కలిగించింది.  ఏచూరి పోరాటాలు స్ఫూర్తిదాయకం. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. 

 సీఎం రేవంత్‌రెడ్డి

దిగ్భ్రాంతి కలిగించింది

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు కనా ప్రగాఢ సానుభూతి 

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉద్యమాలకు లోటు

సీతారాం ఏచూరి ఇక లేరనే వార్త తెలిసి చాలా బాధపడ్డా. ఏచూరి నాతో స్నేహంగా ఉండేవారు. ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు. 

 ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి 

కార్మిక లోకానికి తీరని లోటు

సామ్యవాద భావాలున్న ఏచూరి విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజాపక్షం వహించారు. ఆయన మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటు.  

 కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత 

అవిశ్రాంత పోరాట యోధుడు

సీతారాం ఏచూరి అవిశ్రాంత పోరాట యోధుడు. అభ్యుదయ భావాలు మెండుగా ఉన్న నిండైన రాజకీయ వేత్త. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీలేని పోరాటం చేశారు. బలహీన వర్గాల గొంతుకగా నిలిచిన ఏచూరి మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటు. 

 మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

చిత్తశుది ్ధగల నేత

సీతారాం ఏచూరి తన ప్రస్థానంలో భారత రాజకీయ వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచారు. 2004 యూపీఏ కూటమిలో, ఇటీవల ఎన్నికల్లోనూ కూటమి ఏర్పాటులో ఆయన పాత్ర వెలకట్టలేనిది. ఏచూరి  చిత్తశుద్ధి ఎప్పటికీ ప్రతిఒక్కరిలో స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.

 మంత్రి శ్రీధర్‌బాబు

లోటు పూడ్చలేనిది

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజ్యసభ సభ్యునిగా, సీపీఎం నాయకుడిగా, ఆర్థిక వేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన ఎంతో సేవ చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. 

 అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

ఉత్తమ పార్లమెంటేరియన్

సీతారాం ఏచూరి మరణ వార్త చాలా దుఃఖాన్ని, బాధను కలిగించింది. తాను ఎప్పుడు కలుసుకున్నా ఆత్మీయంగా పలకరించేవారు. ఒక ఉత్తమ పార్లమెంటేరియన్‌ను కోల్పోయాం. 

 హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాలు

సీతారాం ఏచూరి కింది స్థాయి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడు. ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాల్లో పోరాడారు. 

 మంత్రి పొన్నం ప్రభాకర్

విలువలు, సిద్ధాంతాల కలబోత

నిరుపేదల పక్షపాతిగా ప్రజల కోసం పోరాడిన ఏచూరి లాంటి గొప్ప ప్రజా పోరాట యోధుడిని ఈ దేశం కోల్పోయింది. విలువలు, సిద్ధాంతాల కలబోతగా తన రాజకీయ ప్రస్థానాన్ని చివరి వరకు కొనసాగించిన సీతారాం ఆదర్శప్రాయులు. 

 మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు

తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడిన నాయకునిగా ఏచూరి చరిత్రలో నిలిచిపోతారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

 మంత్రి కొండా సురేఖ

సమాజానికి ఎంతో సేవ చేశారు

సీతారాం ఏచూరి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. వివిధ స్థాయిల్లో సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. 

 మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

మూగబోయిన గళమెత్తే గొంతు

ఏచూరి మరణం సీపీఎం పార్టీకే కాదు.. కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని నష్టం. ప్రజా సమస్యలు, దేశ సమస్యలపై గళమెత్తే గొంతు మూగబోయింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. 

 కూనంనేని సాంబశివరావు

బాధాకరం

కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణ వార్త చాలా బాధించింది. వామపక్షాల ఐక్యతను విస్తృతం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఏచూరి మృతి భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికే తీవ్రమైన నష్టం. 

 సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి

తెలుగు ప్రజల యాది

సీతారాం ఏచూరి అనారోగ్యంతో మరణించడం బాధాకరం. తెలుగు వ్యక్తిగా జాతీయ రాజకీయాల్లో రాణించడం ఎంతో గర్వకారణం. నమ్మిక సిద్ధాంతం కోసం జీవితకాలం పనిచేసిన వ్యక్తిగా సీతారాం ఏచూరిని ఎల్లప్పుడూ గౌరవిస్తాం. వారి సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. 

 కేంద్ర మంత్రి బండి సంజయ్

పేదల పక్షపాతి

సీతారాం ఏచూరి పేద ప్రజల పక్షాన అలుపెరగకుండా కొట్లాడిన నాయకుడు. ఆయన మరణం పేద ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

 ఎంపీ ఈటల రాజేందర్