- ఎకరం సాగు భూమికి పాసుపుస్తకం అందుకున్న పిచ్చయ్య
- ముఖ్యమంత్రి రేవంత్‌కు ధన్యవాధాల వెల్లువ
నల్లగొండ, నవంబర్ 5 (విజయక్రాంతి): ఓ రైతు తనకు ఉన్న ఎకరం సాగుభూమికి పట్టాదారు పుస్తకం లేకపోవడంతో 46 ఏం డ్ల పాటు పోరాటం చేశాడు. అయినప్పటికీ రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా 46 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది.
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామానికి చెందిన కొమ్మన బోయిన పిచ్చయ్యకు గ్రామంలోని సర్వే నంబర్ 235/3లో ఎకరా సాగు భూమి ఉంది. 1978లో తనకు అందిన ఆ భూమికి సంబంధించిన పాసుపుస్తకం కోసం రెవె న్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో చేసేదే మీ లేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో జూలై నెలలో పాసుపుస్తకానికి దరఖాస్తు చేసుకున్నాడు.
వందరోజుల్లోనే భూమికి సంబంధించిన పాసుపుస్తకాన్ని మంజూరు చేయించగా మంగళవారం పిచ్చయ్య తన ఇద్దరు కుమారులు నరసింహ, స్వామియాదవ్‌లతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య చేతుల మీదుగా పాస్తుపుస్తకం అందుకున్నారు.
46 ఏండ్ల తన నిరీక్షణకు తెరపడిందంటూ రైతు ఆనందం వ్యక్తం చేశాడు. పాసుపుస్తకంను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.