- ముగిసిన 37వ హైదదాబాద్ బుక్ ఫెయిర్
- గతేడాది కంటే రెట్టింపు స్థాయిలో పుస్తకాల విక్రయాలు
- 15 లక్షల మందికి పైగా సందర్శన
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగుతున్న డిజిటల్ యుగంలోనూ హైదరాబాద్ మహానగర ప్రజలు అచ్చు పుస్తకాలకు జై కొట్టా రు. ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీయార్ స్టేడియం (దాశరథి ప్రాంగణం)లో 11 రోజుల పాటు కొనసాగిన బుక్ ఫెయిర్ ఆదివారంతో ముగిసింది.
పుస్తకాల ప్రదర్శన, విక్రయాల మహోత్సవానికి హైదరాబాద్ మహానగర ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలలనుంచి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా యువత, విద్యార్థులతో పాటు సాహిత్య అభిమానులు ప్రతిరోజూ వేలాదిమంది పుస్తక ప్రియులు బుక్‌ఫెయిర్‌ను సందర్శించారు.
ఈ ఏడాది బుక్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా హాజరవ్వడం బుక్‌ఫె చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ సహా అనేకమంది ప్రముఖులు బుక్ ఫెయిర్‌ను విజిట్ చేశారు. ఈ ఏడాది దాదాపు 15 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు బుక్‌ఫెయియర్‌ను సం నిర్వాహకులు తెలిపారు.
మూడింతలు పెరిగిన అమ్మకాలు
ఈ ఏడాది మొత్తం 350 స్టాల్స్ పైగా ఏర్పాటు చేయగా, అందులో 170 తెలుగు, 135 ఇంగ్లిష్, 27 రచయితల స్టాల్స్ ఉన్నాయి. అమ్మకాలు సైతం గతేడాది కంటే మూడింతలు పెరిగినట్టుగా పలు స్టాల్స్ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. బుక్‌ఫెయిర్‌లో సామాజిక, ఆర్థిక, రాజకీయ,చారిత్రక అంశాలకు సంబంధించిన పుస్తకాలు అత్యధికంగా అమ్ముడయ్యాయి.
అంతే కాకుండా ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటుగా చిన్నపిల్లల బుక్స్ సైతం అత్యధికంగా అమ్ముడుపోయాయి. డాక్టర్ బోయి విజయభారతి వేదికపై విద్యార్థులతో ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, తోపుడుబండి సాదిక్ వేదికపై ఈ 11 రోజుల్లో దాదాపు 50కి పైగా కవులు, రచయితలు రచించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇప్పటివరకు నిర్వహించిన బుక్ ఫెయిర్‌లలో ఈ ఏడాది గతం కంటే భిన్నంగా ‘నాకు నచ్చిన, నన్ను ప్రభావితం చేసిన’ పుస్తకంపై ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన చర్చా కార్యక్రమం పుస్తకప్రియులను ఆకట్టుకుంది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్ట్టిస్ రాధారాణి, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్, సీనియర్ సంపాదకులు కే రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్, కార్యదర్శి వాసు మాట్లాడుతూ.. ఈ ఏడాది బుక్ ఫెయిర్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.