calender_icon.png 1 November, 2024 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథో ధర్మస్తత స్సుఖమ్

28-04-2024 12:15:00 AM

ఉనికి సుఖాన్ని, హితా న్ని, నిరంతరతను ధరించేది ధర్మం. ఎప్పటి కప్పుడు నీతిని నిలపడంతో, అవినీతిని పెరక డంతో ధర్మం పోషింపబడుతుంది. అది సృష్టి నియతి. ఆ పనిని నియమానుసారంగా కాక  అవసరానుకూలంగా చేస్తే ధర్మం రోగగ్రస్తమవుతుంది. ఆ ధర్మజ్ఞానం కలిగినవాడు, తదనుగుణంగా వర్తించువాడు ఉత్తమ పురుషుడు. ఆ ధర్మాన్ని నిలిపేవాడు, దాంతో రాజ్యాన్ని రక్షించేవాడు, లోకానికి గొప్ప పాలనా సంస్కృతిని ప్రసాదించేవాడు ఉత్తముడైన నాయకుడు. 

తన వారు, పరవా రు అనే భేదం లేకుండా, వ్యవహార దక్షత పేరుతో పక్షపాతంతో ప్రవర్తించకుండా (ఎప్పుడో ఒకప్పుడు అల్పవిషయాల్లో తాత్కాలికంగా అనవసర కల్లోలాన్ని ఆపడానికి తప్ప) సమాజంలో ధర్మాన్ని సంవర్ధించే నమూనాగా నిలబడతాడు అతడు. తను మాత్రమే అసమాన నాయకుడని అనుకోడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గద్దెను పట్టుకొని ఉండాలనుకోడు. రాముడు అటువంటి వాడు.అలాగే, శివాజీ, అబ్రహాం లింకన్, వాజ్ పాయ్, పి.వి.నరసింహారావు లాంటివారు చాలావరకు అటువంటివారే.  

వారు లోక క్షేమకరమైన, ధర్మభ్రష్టం కాని రాజకీయ సంస్కృతిని దేశానికి అందించిన వారు. విపక్షశీల హననానికి , గట్టిపోటీ నిర్మూలనకు ‘ఒక విధానం’గా  అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయనివారు. అట్లా చేస్తే, అన్ని రంగాల్లో, అన్ని స్థాయిల్లో అవసరానుగుణంగా అధికార దుర్వినియోగానికి ప్రేరణ నిచ్చిన వాళ్ళమవుతామన్న అవగాహన కలిగిన వాళ్ళు. ఈ సువికసిత ప్రజాస్వామ్య పరిస్థితి  పరివర్ధిత పాశ్చాత్య దేశాల్లో ప్రబలంగా ప్రకాశిస్తుంది. దానివల్లే అక్కడ ధర్మం సగటు సమాజంలో సహజమై సబలంగా ప్రవర్తితమవుతుంది . అందువల్లే అక్కడ జనజీవనం బహుసుఖమయంగా సాగుతుంది. అందుకే, నవ్యభారత మేధస్సు నవనీతం. వీలైనంత వరకు అటువంటి దేశాల్లో స్థిరపడాలని ఉవ్విళ్ళూరుతుంది .  (అక్కడ తమ స్థానాన్ని సుస్థిరంగా భద్ర పరచుకొని ఇక్కడి భజన చేయడం వేరు). 

అటువంటి ధర్మభ్రష్టం కాని రాజకీయ సంస్కృతి ధీరోదాత్తులైన నాయకులద్వారా, వారికి వివేకంతో, నిష్పక్షపాతంతో, విమర్శనాత్మకంగా  మేధావులు అందించే ఆమోదబలం ద్వారా మాత్రమే సమాజంలో క్రమంగా ప్రస్థాపితమవుతుంది. అవి లోపిస్తే సమాజంలో సగటున వెలయాలి విలువలే వ్యాపిస్తాయి. ధార్మిక సుఖానికి సత్త్వహేతువు కాని విజయం, ప్రగతి బహుళ అనర్థదాయకం.

 యముగంటి ప్రభాకర్

9440152258