22-04-2025 12:38:28 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : జిల్లాలో యాసంగి 2022 సంవత్సరానికి సంబంధించి వరిధాన్యం బకాయి ఉన్న రైస్ మిల్లర్లు బకాయిలను వెంటనే పూర్తిగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, రైస్ మిల్లర్లతో బకాయి చెల్లింపులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో యాసంగి 2022 సంవత్సరానికిగాను రైస్ మిల్లులకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఆక్షన్ వరిధాన్యం బకాయి ఉన్న దాదాపు 87 కోట్ల రూపాయలను రైస్ మిల్లర్లు వెంటనే చెల్లించాలని, 1 కోటి రూపాయలలోపు ఉన్న వారు తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆక్షన్ వరిధాన్యం బకాయి పూర్తి చేసి యాసంగి 2024- సంబంధించి వరిధాన్యం దిగుమతి చేసుకోవడానికి సంసిద్ధం గా ఉండాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల అధికారి, అసిస్టెంట్ గ్రేడ్-1 అధికారి, జిల్లా రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.