calender_icon.png 6 October, 2024 | 3:59 PM

వేములవాడలో నూలు డిపో

06-10-2024 02:14:15 AM

ఏర్పాటుకు రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ విడుదల

ఉత్తర్వులు జారీ చేసిన చేనేత, జౌళ్ల శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మరమగ్గాల కార్మికుల కోసం నూలు డిపో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్ లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(టీజీఎస్‌సీవో)తో కలిసి సంయుక్తంగా వేములవాడ లో నోడల్ ఏజెన్సీ లాగా నూలు డిపో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు చేనేత, జౌళ్ల శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూలు డిపో ఏర్పాటుతోపాటు నిర్వహణ కోసం రూ.50 కోట్ల కార్పస్ ఫండ్‌ను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీసీ సంక్షేమం కోసం కేటాయించిన ప్రత్యేక నిధుల నుంచి నూలు డిపో ఏర్పాటుకు నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు.

వీవర్స్‌కు అన్ని విధాలా సహక రించడంలో భాగంగా వారికి కావాల్సిన నూలు ను సేకరించి, భద్రపరుచుకునేందుకు ఈ నూలు డిపో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. దీనికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని చేనేత, జౌళ్ల శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. 

మంత్రి తుమ్మల హర్షం..

దాదాపు 30 ఏండ్లుగా ఎదురుచూస్తున్న మరమగ్గ కార్మికుల కల నెరవేరిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. నూలు డిపో ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మరమగ్గాలపై పనిచేస్తున్న 30 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.

దీంతోపాటు మరమగ్గాల పరిశ్రమల లేని నేతన్నలు పెట్టుబడిదా రులపై ఆధారపడకుండా నేరుగా ఉపాధి పొందే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.