calender_icon.png 19 October, 2024 | 12:17 PM

యాహ్యా సిన్వర్ తుదిపోరు

19-10-2024 02:12:50 AM

టెల్ అవీవ్, అక్టోబర్ 18: ఆధిపత్యవాదానికి, ఆత్మరక్షణకు మధ్య జరిగే ఘర్షణే విప్లవం గా మారుతుంది. అది మరింత ముదిరితే యు ద్ధంగా మారిపోతుంది. ప్రపంచంలోని ప్రధాన విప్లవాలన్నీ ఇలా వచ్చినవే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్‌గాజా యుద్ధం మూలా లు కూడా ఆధిపత్యం ఆత్మరక్షణ మధ్య ఘర్షణలోంచి వచ్చినవే. ఇజ్రాయెల్‌పై ఏడాది క్రితం హమాస్ దాడిచేసి 1200 మందిని దారుణంగా చంపేస్తే ప్రపంచం మొత్తం ఆక్రోషించి ంది. కానీ, ఆ భీకర దాడి కి కారకుడైన హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ పోరాటాన్ని సంబురాలుగా జరుపుకొనే జనం కూడా లక్షల్లో ఉన్నా రు. ఇజ్రాయెల్ బుధవారం జరిపిన దాడిలో సిన్వర్ మరణించాడు. అతడికంటే ముందు ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నేతలెందరో మరణించారు. వారి మరణానికి గాజా ప్రజలు కన్నీరు కార్చారు. కానీ, సిన్వర్ మరణాన్ని చూసి సంబురాలు చేసుకొంటున్నారు. సంతోషంతో కాదు.. గర్వంతో.. సిన్వర్ చివరి క్షణాల కు సంబంధించిన డ్రోన్ ఫుటేజీని ఇజ్రాయెల్ శుక్రవారం విడుదల చేసింది. 

రక్త పిపాసిగా ముద్ర

దశాబ్దాల పోరాటంలో హమాస్ ఉగ్రవాద సంస్థకు ఎంతోమంది నాయకత్వం వహించారు. గత జూలైలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ దాడిలో మరణించేవరకు హమాస్ అంటే హనియేనే అని ప్రపంచం మొత్తం అనుకొనేది. కానీ, హనియేను చూసి ఇజ్రాయెల్ పెద్దగా భయపడలేదు. ఆ దేశాన్ని అనుక్షణం వణికించిన వ్యక్తి యాహ్యా సిన్వర్. ఇజ్రాయెల్ ప్రభుత్వ, సైనిక నేతల మనసులను కచ్చితంగా చదవగల తెలివితేటలు సిన్వర్‌కు మాత్రమే ఉన్నాయని చెప్తారు. ఇతడు ఇజ్రాయెల్‌పై అత్యంత హింసాత్మక దాడులు చేయించాడు. అందుకే ఇతడిని రక్తపిపాసి, సామూహిక మానవ హనన కారకుడు అని నిందిస్తారు. సుదీర్ఘకాలం ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గిన అతడు.. శత్రువు చేతిలో చిత్ర హింసలకు గురయ్యాడు. 

జీవితమంతా పోరాటమే

సిన్వర్ 1962లో గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరాల్లో పుట్టి పెరిగాడు. చిన్నతనంలోనే పాలస్తీనా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న హమాస్‌లో చేరాడు. ఇతడ తీవ్ర హింసాత్మక భావజాలంతో ఉండేవాడని చెప్తారు. అందుకే హమాస్ రాజకీయ అధిపతిగా కొనసాగి, చర్చలకు మొగ్గుచూపిన హనియే వంటివారిని తీవ్రంగా విమర్శించేవాడు. యుద్ధం ద్వారానే ఇజ్రాయెల్‌ను ఓడించి, పాలస్తీనా దేశాన్ని ఏర్పాటుచేయటం సాధ్యమని బలంగా నమ్మేవాడు. అందుకే ఆగర్భ శత్రువుగా భావిం చే ఇజ్రాయెల్‌పై అనేకసార్లు భీకర దాడులు చేయించాడు. 2017 నుంచి గాజాలో హమాస్‌కు సిన్వర్ నాయకత్వం వహిస్తున్నాడు. అత డు 1990 నుంచి 2011 వరకు దాదాపు 22 ఏండ్లు ఇజ్రాయెల్ జైల్లలోనే మగ్గిపోయాడు. అయినా తన పోరాటాన్ని వదిలిపెట్టలేదు. 2011లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైనికుడిని కిడ్నాప్ చేశారు. అతడిని విడిపించుకొనేందుకు ఇజ్రాయెల్ హమాస్‌తో చర్చలు జరిపింది. జైల్లో ఉండే ఆ చర్చల్లో హమాస్ తరఫున సిన్వర్ ప్రతినిధిగా కొనసాగాడు. తన తోపాటు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 1,27 మంది పాలస్తీనా పోరాటయోధులను విడిపించుకుపోయాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత అతడి హింసాత్మక వైఖరి మరింత పెరిగింది. 

సిన్వర్ కోసం ప్రత్యేక వేట

తన చుట్టుపక్కల దేశాల్లో చీమ చిటుక్కుమన్నా తెలుసుకొనేంత నెట్‌వర్క్ ఇజ్రాయెల్ సొంతం. అంతటి నెట్‌వర్క్‌ను తుత్తునియలు చేస్తూ జరిగిన అక్టోబర్ ౭ పాశవిక దాడికి వ్యూహకర్త సిన్వరేనని ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా కూడా ప్రకటించింది. అప్పటి నుంచి సిన్వర్‌ను చంపటమే ప్రధాన లక్ష్యంగా తన సర్వ శక్తులను ఒడ్డింది. ఆ క్రమంలో హమాస్ నేతలందరినీ చంపేసింది. కానీ సిన్వర్ ఇంతకాలం దొరకలేదు. ఇజ్రాయెలీ బందీలను రక్షణ కవచాలుగా మార్చుకొని గాజా మెట్రో గా పిలిచే సొరంగాల్లో దాక్కొన్నాడని వార్తలు వచ్చాయి. గాజా విడిచి పారిపోయాడని కూడా వదంతులు వినిపించాయి. కానీ, అతడు యుద్ధ క్షేత్రంలోనే ఉండి పోరాడుతున్నాడని బుధవారమే తేటతెల్లమైంది. 

యుద్ధం ఆపేస్తాం.. కానీ: నెతన్యాహు

సిన్వర్‌ను మట్టుబెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ.. గాజా ప్రజలకు శుక్రవారం ఓ ఆఫర్ ఇచ్చారు. హమాస్ మిలిటెంట్లు ఆయుధాలను విడనాడితే రేపే యుద్ధాన్ని విరమిస్తామని ప్రకటించారు. సిన్వర్‌ను వెంటాడి వేటాడి ఎట్టకేలకు అతడి లెక్క సరిచేశామని పేర్కొన్నారు.