calender_icon.png 25 September, 2024 | 6:03 PM

యాదిరెడ్డి దూరమై 13 ఏళ్లు!

25-09-2024 12:00:00 AM

తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులవి.. ఉద్యమానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌లోని ఓయూతో పాటు జిల్లాల్లో ఎంతో మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్న సందర్భం అది.. అయినా ఢిల్లీ పాలకులు స్పందించేందుకు కూడా ఇష్టపడని కాలమది.

అందుకే గల్లీలో చనిపోతే ఢిల్లీ పాలకులకు ఎట్ల తెలుస్తదని అనుకున్నడో ఏమో..? రంగారెడ్డి జిల్లాకు చెందిన యాదిరెడ్డి.. ఏకంగా దేశరాజధానిలో పరిపాలనా కేంద్రమైన పార్లమెంట్ ఆవరణలోనే పానం తీసుకున్నాడు. సంచలనంగా మారిన ఆ సంఘటన యావత్ దేశానికి రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను చాటిచెప్పింది. యాదిరెడ్డి చనిపోయి 13 ఏండ్లు దాటిపోయా యి. ఆ కుటుంబానికి ప్రభు త్వం ఇస్తానన్న హామీల్లో కొన్ని నెరవేరగా.. ఇంకొన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన మందడి యాదిరెడ్డిది నిరుపేద కుటుంబం. అతని తండ్రి యాదిరెడ్డి చిన్నతనంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లి చంద్రమ్మ అన్ని తానై యాదిరెడ్డితో పాటు తమ్ముడు ఓం రెడ్డి, కూతురును పోషించేది.

కానీ ఆమె సంపాదన కుంటుంబానికి ఏ మాత్రం సరిపోకపోవడంతో యాదిరెడ్డి కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో ఓ గదిని అద్దెను తీసుకొని డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అప్పటికే తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్న అతను కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల వద్ద చర్చ పెట్టేవాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి స్వగ్రామం కావడంతో యాదిరెడ్డికి సహజంగానే తెలంగాణ గురించి ఆలోచన ఉండేది. అయితే 2009 డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా ఉందని ప్రకటన చేయడం, ఆ తర్వాత ఆంధ్ర నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గడం యాదిరెడ్డి తీవ్రంగా కలిచివేసింది. 

వెంటనే వచ్చేస్తానని ఢిల్లీకి పోయి..

యాదిరెడ్డి 19 జూలై 2011 రోజు ‘ఢిల్లీకి పోతున్న.. వెంటనే వచ్చేస్తా’ అని తల్లి చంద్రమ్మకు ఫోన్‌లో చెప్పిండు. తమ్ముడు ఓం రెడ్డికి ఫోన్ చేసి ‘ఢిల్లీకి పోతున్న.. అమ్మను జాగ్రత్తగా చూసుకోమ్మని చెప్పిండు.. పొద్దున్నే చెల్లెకు ఫోన్ చేసి కోడలితో మాట్లాడించాలని కోరిండు..  కానీ, వీళ్లెవరూ ఊహించలేకపోయారు.. అతను ఆత్మబలిదానం చేసుకోబోతున్నాడని..! 20 జూలై 2011న యాదిరెడ్డి తెలంగాణ కోసం పార్లమెంట్ ఆవరణలో చెట్టుకు ఊరేసుకున్నాడన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

శ్రీకాంతా చారి తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపింది యాదిరెడ్డి ఆత్మబలిదానమే. అప్పటి పాలకులు యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీ భవన్‌కు తీసుకుపోనివ్వలేదు.. కనీసం హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. దీంతో స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. అప్పటి టీఆర్‌ఎస్ కీలక నేతలు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్ స్వయంగా వచ్చి యాదిరెడ్డి పాడె మోశారు.  

మూడెకరాల భూమి, పింఛన్ ఇయ్యలె..

కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చాన తర్వాత యాదిరెడ్డి కుటుంబానికి రూ.10 లక్షలు,  యాదిరెడ్డి తమ్ముడు ఓం రెడ్డికి నాంపల్లిలోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్‌లో ఆఫీసు సబార్జినేట్‌గా ఉద్యోగం ఇచ్చారు. అలాగే అతని తల్లి చంద్రమ్మ పేరు మీద గ్రామంలో 500 గజాల ఇంటి స్థలం, సన్ సిటీ పరిధిలోని గంధంగూడలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో ఓ ఇల్లు ఇచ్చారు.

అయితే  ఈ ఇల్లు ఇంకా హ్యాండోవర్ చేయలేదని ఓం రెడ్డి చెప్పారు. అలాగే మూడెకరాల భూమి, యాదిరెడ్డి తల్లికి ఇస్తానన్న రూ.25 వేల పింఛన్ ఇవ్వలేదని వాపోయాడు.  తొమ్మిది జులై  2023న అప్పటి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య యాదిరెడ్డి విగ్రహం పెడుతామని మాటిచ్చి తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 జూకంటి నరేందర్, చేవెళ్ల