బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక
బంగారం, నిధుల సమీకరణకు ఉన్నతస్థాయి కమిటీ
త్వరలో సీఎం ఆధ్వర్యంలో సమావేశం
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): స్వయంభూ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ సొబగులు దిద్దుకోనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దేవాదాయ శాఖ శరవేగంగా చర్యలు చేపడుతోం ది. విమాన గోపురం స్వర్ణతాపడం చేపట్టడానికి అవసరమైన బంగారం, నిధుల అందు బాటుపై వైటీడీఏ, ఆలయ అధికారులను దేవాదాయ శాఖ ఇప్పటికే నివేదిక కోరింది.
అయితే, స్వర్ణ తాపడానికి అవసరమైన పరిమాణంలో బంగారంను సమీకరిం చడానికి, పనుల పర్యవేక్షణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ జీవోను సైతం జారీ చేసింది.
దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా అయ్యర్ చైర్‌పర్సన్‌గా, వైటీడీఏ సీఈవో జీ కిషన్‌రావు సభ్య కార్యదర్శిగా, దేవాదాయ శాఖ కమిషనర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సభ్యులుగా ప్రత్యేక కమిటీ నియా మకానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో సీఎం ఆధ్వర్యంలో ఈ కమిటీ సమావేశమై యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం పనులపై సమీక్షించనున్నట్టు దేవాదాయ శాఖ అధికారి ఒకరు విజయ క్రాంతి ప్రతినిధికి తెలిపారు.
భక్తుల నుంచి అపూర్వ స్పందన
విమాన గోపుర స్వర్ణతాపడం పనులను వైటీడీఏ ప్రతిపాదించగా భక్తుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. దాదాపు 11 కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదును భక్తులు కానుకలుగా సమర్పించారు. దాదా పు నాలుగేళ్ల క్రితమే చెన్నైకి చెందిన సంస్థ అంచనాల ప్రకారం దాదాపు 67 కిలోల బం గారం అవసరం పడుతుంది. అదే తాపడం నగిషీ పనులకు దాదాపు రూ.6 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
అయితే, ప్రస్తుతం భక్తుల నుంచి విరాళంగా అందిన బంగారం, నగదుతో పాటు స్వామివారికి కానుకలుగా వచ్చిన ముడి బంగా రాన్ని ప్రభుత్వ మింట్‌లో కరిగించి వినియోగించనున్నారు. అదే విధంగా పెద్ద పరిమా ణంలో ఆలయ ఖజానాలో గల వెండిని కూడా బంగారంగా కన్వర్ట్ చేసి వినియోగించాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు, ఇంకా ఏమైనా నిధులు అవసరమైతే ప్రభుత్వం సమీకరించడానికి గల అవకాశాలను సీఎం సమక్షంలో జరిగే సమావేశంలో నిర్ణయిస్తారని తెలుస్తోంది.
బ్రహ్మోత్సవాల నాటికి..
పనులను మార్చిలో జరిగే స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సీఎంతో సమావేశం అనంతరం అవసరమైన సాంకేతిక, పరిపాలన అనుమతులు తీసుకోన్నారు. ఈ పనులను చేపట్టడానికి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ సంస్థను ఖరా రు చేశారు.
ఈ సంస్థకు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, విజయ వాడ ఆలయ విమాన గోపురాలకు స్వర్ణతాపడం పనులు చేసిన అనుభవం ఉంది. ఈ సంస్థ ఇప్పటికే అవసరమైన రాగి తొడుగులను తయారీ చేసింది. ఈ తొడుగులకు బంగారు పూత పూసి, విమాన గోపురానికి అమర్చడానికి రెండు, మూడు నెలలు పడుతుందని భావిస్తున్నారు.
45 అడుగుల పంచతల విమాన గోపురం
యాదాద్రి లక్ష్మీనరసింహుడు కొలువైన గర్భాలయంపై కృష్ణరాతి శిలలతో పంచతల విమాన గోపుర నిర్మాణం అద్భుత కళానైపుణ్యంతో నిర్మించారు. 45 అడుగులు గల ఈ విమాన గోపురంపై 48 దేవతామూర్తుల విగ్రహాలను అమర్చారు. ఈ విమాన గోపురాన్ని స్వర్ణశోభితం చేయడంలో భాగంగా రెండేళ్ల క్రితమే అవసరమైన తొలిపనులు ప్రారంభించారు.
అందుకు అవసరమైన రాగి తొడుగుల పనులను చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ లోహ కళాకారులు చేపట్టారు. ఇందుకోసం 10,680 కిలోల రాగిని వినియోగించారు. విమాన గోపురం చుట్టూ 9 వేల కిలోలు, గోపురానికి అమర్చిన 48 దేవతా విగ్రహాలకు 1,680 కిలోల రాగిని వినియోగించారు. ఇందుకోసం దాదాపు రూ.5.40 కోట్లు వ్యయం చేసినట్టుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, రాగి తొడుగులకు బంగారు తాపడం చేసే పనులు చేపట్టి స్వామివారి విమాన గోపురానికి స్వర్ణ సొబగులు దిద్దాల్సిన పనులు చేయాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు 127 కిలోల బంగారం అవసరమైతుందని అంచనా వేశారు. అయితే, ప్రస్తుతం వివిధ కారణాలతో స్వర్ణతాపడం పనులను 67 కిలోలకే పరిమితం చేసినట్టుగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.