calender_icon.png 9 November, 2024 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి ఇక యాదగిరిగుట్టే!

09-11-2024 12:00:00 AM

  1. అన్ని రికార్డుల్లోనూ వ్యవహారికంలోకి తేవాలి
  2. బ్రహ్మోత్సవాల నాటికి విమాన గోపురానికి బంగారు తాపడం
  3. ఆలయానికి తిరుమల స్థాయి టెంపుల్ బోర్డ్
  4. బోర్డు ఏర్పాటుపై అధ్యయనం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  5. యాదాద్రి నృసింహుని దర్శించుకున్న సీఎం
  6. తర్వాత వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం

యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (విజయక్రాంతి): యాదాద్రి ఇక యాదగిరిగు ట్టేనని, కానీ.. గత ప్రభుత్వం యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చిందని, ఇప్పుడు అన్ని రికార్డుల్లోనూ యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన జన్మదిన సందర్భంగా యాదాద్రి నృసింహస్వామి ఆలయానికి విచ్చేశారు.

ఆలయ అధికారులు, వేద పండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం తొలుత అఖండ దీపంలో తైలం పోశారు. పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిధిలో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆలయానికి తిరుమల తరహాలో టెంపుల్ బోర్డు ఏర్పాటు చేస్తామ న్నారు. దేవాదాయశాఖ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బోర్డుకు ప్రాధా న్యం ఉండే విధంగా సమగ్రమైన అధ్యయనం చేయాలని సూచించారు. దీనిపై వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. అందుకు అవసరమైన నిధుల కేటాయింపులను ఆర్థిక శాఖ చూసుకోవాలన్నారు.

ఆలయ పరిధిలో అసం పూర్తిగా ఉన్న  అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని, ఆలయ అభివృద్ధికి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. గర్భాలయంలోని విమాన గోపుర బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి తాపడం పనులు పూర్తి కావాల్సిందేనని, పనుల విషయంలో అలసత్వాన్ని సహించబోమన్నారు. 

గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ

గోశాలల్లో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయాల పరిధిలోని గోశాలల  నిర్వహణపై పకడ్బందీగా విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.

యాదగిరిగుట్టలో భక్తుల విశ్వాసాల మేరకు పూజా విధానాలను కొనసాగించాలని ఆలయ ఆధికా రులకు సూచించారు. కొండపై గతంలో భక్తులు రాత్రిళ్లు నిద్ర చేసి మొక్కులు చెల్లించుకునేవారని, భక్తులకు ప్రస్తుతం ఆ సౌక ర్యం లేకపోవడం సరికాదన్నారు. భక్తులు రాత్రిళ్లు నిద్ర చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సీఎం వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ అయ్యర్, వైటీడీఏ వైస్ చైర్మెన్ జి.కిషన్‌రావు, కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.